నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదు అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాహితీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే.. వేటగాళ్లు చెప్పే పిట్ట కథలే చరిత్రగా నిలిచిపోతాయనేది అక్షర సత్యం. యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తుంటారు.. అదే తెలంగాణలో జరుగుతుంది. కేసీఆర్ మీద కోపంతో ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తాడు. కానీ కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం గురించి ఒక్క మాట రాదు. శ్వేతసౌధం లాంటి అంబేద్కర్ సచివాలయం గురించి ఒక్క మాట రాదు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు.. ఈ పదేళ్లలో జరిగిన నిర్మాణాల గురించి సీఎంకు మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్రను చెరిపేయాలనే మూర్ఖపు నాయకులు ఉన్నారు. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్నే మార్చే ప్రయత్నం చేస్తే చరిత్ర క్షమించదు. దేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రంగా ఆర్బీఐ లెక్కల ప్రకారం తలసరి ఆదాయంలో తెలంగాణ ముందుంది. మూర్తీభవించిన ఒక దేవతలాగా తెలంగాణ తల్లిని కేసీఆర్‌తో పాటు కొందరు ఉద్యమకారులు 2007లో రూపొందించారని కేటీఆర్ గుర్తు చేశారు.