నవతెలంగాణ హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై బాధ్యత మరచి కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ట రాజకీయాలు చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడటానికి, ఎండాకాలంలో ప్రజలు గొంతులు ఎండగా చూడటానికే తాము చలో మేడిగడ్డ చేపట్టామని ఆయన తెలిపారు. తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ చలో మెడిగడ్డ పర్యటన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ మీద కోపాన్ని రైతుల మీద చూపించొద్దని కేటీఆర్ హితవు పలికారు.
ఎండుతున్న పంటలకు తక్షణమే నీరందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ప్రయోజనం కాదు, రాజకీయ ప్రయోజనమే కాంగ్రెస్ కు కావాలని విమర్శించారు. నేడు తాము చేస్తున్న పర్యటన అనంతరం అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామన్నారు. మరమ్మతులు చేయడానికి ఎందుకు ఇబ్బంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి. కానీ, రైతులను బలి చేయొద్దని సూచించారు. రిపేర్ చేయకుంటే వర్షాకాలంలో బరేజ్ కొట్టుకుపోతుందని చూస్తున్నారని ఆరోపించారు.|
కాళేశ్వరం గొప్పదనాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోడతుంది: పోచారం
కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా, రాష్ట్రంలో కరువును పారద్రోలేలా కేసీఆర్ నిర్మించారని చెప్పారు. ఆరు వందల మీటర్ల లోతు నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టని చెప్పారు. బీఆర్‌ఎస్ చలో మేడిగడ్డ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుందన్నారు. కానీ ప్రాజెక్టు గొప్పదనాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని విమర్శించారు. కాళేశ్వరం నుంచి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామన్నారు.