ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని తెలంగాణ మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రధాని మోడీ దెబ్బతీస్తున్నారన్నారు. అదే సమయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోలేదనడం సరికాదని, ఇది అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మోడీ తెలంగాణ విరోధి అంటూ ట్వీట్‌ను ప్రారంభించారు. అంతకుముందు, కాంగ్రెస్ అర్ధ శతాబ్ధపు పాలన మోసం.. వంచన.. ద్రోహం.. దోఖాలమయం.. అంటూ విమర్శలతో ట్వీట్ చేశారు.

‘మోడీ…తెలంగాణ విరోధి!

తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు
ఎందుకు ప్రధాని..?

అమృతకాల సమావేశాలని పేరుపెట్టి
విషం చిమ్మడం ఏం సంస్కారం ..?

తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు
మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..?

తల్లిని చంపి బిడ్డను తీసారని
అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు
మా అస్తిత్వాన్ని అవమానిస్తారు..?

పద్నాలుగేండ్లు పోరాడి..దేశాన్ని ఒప్పించి మెప్పించి
సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకు..?

ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని
మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారు మీరు..?

వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని
మా రైతుల్ని కించపర్చిండు..మీ కేంద్రమంత్రి..
ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా..మీలాగే మీ మంత్రులు..!

మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వరు
కనీసం..మాటల్లోనైనా మర్యాద చూపించండి ..!

కోటి ఆశలు..ఆకాంక్షలతో  పురుడుపోసుకొన్న
కొత్త రాష్ట్రానికి సహకరించక పోగా..ఆదినుంచి కక్షను
పెంచుకొని..వివక్షనే చూపిస్తున్నారు మీరు..!

ఏడు మండలాలు గుంజుకొని ..లోయర్ సీలేరు ప్రాజెక్టును
లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోం..!

నీతి ఆయోగ్‌ చెప్పినా  నీతిలేకుండా
మిషన్ కాకతీయ..భగీరథలకు నిధులను నిరాకరించిన
మీ నిర్వాకాన్ని ఏమనాలి..?

కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా
దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా  అర్థంచేసుకోవాలి..?

కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి
దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా..?

157 మెడికల్ కాలేజీల్లో ..ఒక్కటి ఇవ్వకుండా
గుండుసున్నా చేసారంటే ..మీకు తెలంగాణపై ఎంత కోపమో కదా..!

పైన అప్పర్ భద్ర..కింద పోలవరం..ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయ
హోదాఇచ్చి..మధ్యలో తెలంగాణకు  మొండిచేయి ఎందుకు..
మేం చేసిన పాపమేంది..?

బయ్యారంలో  ఉక్కు ఫాక్టరీ ఉరేసి..గిరిజన వర్సిటీ పెట్టకుండా
నానబెట్టి..ఆదివాసులపై కక్షసాధిస్తున్నారు ఎందుకు..?

సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేస్తరు..
ఐటీఐఆర్‌ను రద్దు చేస్తరు..
హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు..
మీరు నిధులివ్వరు…సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే
ఆంక్షలు విధిస్తరు..!

అడుగడుగునా దగా..ప్రశ్నిస్తే పగ
జుమ్లా..హమ్లా డబుల్ ఇంజన్‌ సర్కారు మీది..!

ఈడీ..ఐటీ..సీబీఐలను మీ ఎన్డీయే కూటమిలో
చేర్చుకొని ..ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలను
పడగొట్టడమే పనిగా పెట్టుకున్నమీకు..పొద్దున లేచి
ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం ..విచిత్రం..!

డబుల్ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టే మీకు
తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు..
డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా..!’ అంటూ ట్వీట్ చేశారు.

Spread the love