మా తప్పు అదే.. అందుకే ఓడిపోయాం : కేటీఆర్

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణ గళం, బలం, దళం పార్లమెంట్‌లో చూడాలంటే బీఆర్ఎస్ గెలవాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా నేతలతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే. దేశంలో ఒక్కో రాష్ట్రం పేరు చెబితే ఒక్కో నేత గుర్తుకు వస్తారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కేసీఆర్‌ పేరు మాత్రమే. తెలంగాణ హక్కుల గురించి మాట్లాడటం బీజేపీ, కాంగ్రెస్‌ వల్ల కాదు. పార్లమెంట్‌లో ఎప్పుడైనా తెలంగాణ గురించి మోడీ, రాహుల్‌ మాట్లాడారా? బీఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే తెలంగాణ అనే పదం మాయమవుతుంది. బీఆర్ఎస్ కు ప్రధాన కేంద్రం, ప్రధాన అజెండా తెలంగాణ. కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచింది. ఆ పార్టీ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతాం. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుంది. సీఎంగా కేసీఆర్‌ లేకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పై జరిగిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని కొందరు చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని చెప్పారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్పిందని, చిన్న చిన్న లోపాల వల్లే ఓడిపోయామని నేతలు చెప్పారు’’ అని కేటీఆర్‌ వివరించారు.

Spread the love