నవతెలంగాణ – హైదరాబాద్: మేము అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్‌ను జైల్లో వేసేవాళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డి లాగా గుంజుకుపోయేటోళ్లం అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ గారూ.. మీ అత్యుత్సాహాన్ని తాను అర్థం చేసుకోగలనని సెటైర్ వేశారు. ‘‘బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా కేసీఆర్ గారిని జైల్లో పెట్టడం పట్ల మీకున్న అత్యుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఓటుకు నోటు స్కామ్‌లో కెమెరాకు చిక్కిన వ్యక్తి ఇప్పటికీ స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడో చెప్పండి! మీరు ప్రశ్నించలేదు’’ అని కేటీఆర్ విమర్శించారు. ‘‘బహుశా బడే భాయ్ (ప్రధాని మోడీ), ఛోటే భాయ్ (సీఎం రేవంత్) మధ్య సంబంధాన్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా దర్యాప్తు చేయాలేమో కదా?. కొన్నేళ్లుగా అన్ని సాక్ష్యాలు స్పష్టంగా బయటకు కనిపిస్తున్నప్పటికీ ఛోటే భాయ్ ఎందుకు జైలులో లేడు!. ఇన్నాళ్లూ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాదా?. మిమ్మల్ని ఆపేది ఏది? ఎవరు? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.