కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాన – హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిలో రోషం పొడుచుకుని వస్తోందని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇటుకలతో కొడితే, తాము రాళ్లతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడడంలేదని, అతడి పాత బుద్ధులన్నీ బయటకు వస్తున్నాయని విమర్శించారు. అసలు… రేవంత్ సీఎం అవుతాడని ముందే తెలిస్తే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లే ఊహించలేదని అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ నాయకులు కాదా? అని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇప్పుడు ఏం చేయాలో కాంగ్రెస్ వారికే అర్థం కావడంలేదని, కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Spread the love