నవతెలంగాణ-సూర్యాపేట.
జిల్లాలో యువత ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఐటి హబ్ సూర్యాపేట లో ఏర్పాటు కానున్నది. ఇందుకు గాను పాత కలెక్టరేట్ భవనాన్ని ఐటి హబ్ గా మార్చ నున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇందుకు గాను ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం జిల్లా కేంద్రం వాసులకు అందని ద్రాక్షగా మారింది. ఇందుకు సంబంధించి చదువుకున్న విద్యార్థులకు స్థానికంగా అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళుతున్నారు. మధ్య తరగతి, సాధారణ విద్యార్థులకు ఐటీ ఇప్పటికీ కలగానే ఉంది.యువకులు ఐటిపై పట్టు సాధించేందుకు సమయము, ఆర్థికంగా కూడా ఖర్చులు చెల్లించాల్సిన నేపథ్యంలో నియోజకవర్గంలోని యువత కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై గట్టి పట్టు సాధించేందుకు, విద్య ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు గాను ఐటీ హబ్ ఏర్పాటు గురించి నిక్షిప్తంగా గమనించిన మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా కేంద్రంలో హబ్ ఏర్పాటు కు పూనుకొని ఆ దిశగా అడులేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే జూమ్ మీటింగ్ ద్వారా సూర్యాపేట లో ఐటి టవర్ ఏర్పాటు గురించి అమెరికా లోని ఆయా ఐటీ కంపెనీ ప్రతినిధులు రాజ్ సంగాని, శశి దేవిరెడ్డి, సందీప్ రెడ్డి కట్టా, ఫణి పాలేటి, ప్రియా రాజ్ విజయ్ దండ్యాల, అభిషేక్ బోయినపల్లి, తెలంగాణ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈఓ విజయ్ రంగినేని, టాస్క్ కో -ఆర్డినేటర్ ప్రదీప్ లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పలు అమెరికన్ ఐటీ కంపెనీల ప్రతినిదులతో మంత్రి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాలకు వారధిగా ఉన్న సూర్యాపేటలో త్వరలో ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రం మంత్రి ఆదేశించారు. అన్ని రంగాలలో అభివృద్ధి పరంగా దూసుకు పోతున్న సూర్యాపేట ఐటి హబ్ లాంటి మరో మణిహారం రానుంది.స్థానిక పాత కలెక్టర్ కార్యాలయం లో ఐటి టవర్ ను రానున్న వారం పది రోజుల్లో ఏర్పాటు చేసేందుకు మంత్రి నేతృత్వం లోని అధికార అధికార యంత్రాంగం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల హార్డ్వేర్ డిజైన్, కంప్యూటర్ సిస్టమ్స్, కాంపోనెంట్ ప్రొఫైల్స్ పరిజ్ఞానము, వినియోగదారులకు ప్రత్యేక అవసరాల కోసం వివిధ ప్రోగ్రాం డిజైన్ చేసేందుకు, ప్రజల సాధారణ అవసరాలు తీర్చే అప్లికేషన్స్, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్వేర్ అభివృద్ధితో పోటీ, ప్రాసెసింగ్ సర్వీసులు,సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, కాంట్రాక్ట్ సర్వీసులు, ఐటిలో శిక్షణ ఇచ్చే సామర్థ్యం, ఈ కామర్స్, గ్రాఫిక్స్, మల్టీమీడియా, జిపిఎస్, ఐటీ సంబంధ కంప్యూటర్లలో సామర్ధ్యము తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాలలో కంప్యూటర్ సైంటిస్టులు, టెక్నాలజీస్టులు, హార్డ్వేర్ ఇంజనీర్లు, సిస్టం అనలిస్టులు, ఆర్ అండ్ డిస్పెషలిస్టులు, డిజైన్ ఇంజనీర్లు, హార్డ్వేర్ టెక్నీషియన్స్, సర్వీస్ ఇంజనీర్స్, ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్, సిస్టం కొడర్ అనలిస్టులు, సిస్టం డిజైనర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్స్, డాటా బేస్ అడ్మినిస్ట్రేట్రర్స్, డాటా బేస్ మేనేజర్స్, మెడికల్ ట్రాన్సిప్షన్ అండ్ కాల్ సెంటర్స్, ఈ కామ్ స్పెషలిస్టులు, గ్రాఫిక్ మల్టీమీడియా వింగులు, క్వాలిటీ ఇన్సుమెంట్స్ విభాగం, ఇంజనీరింగ్ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ కొనసాగవచ్చు.ఐటీ హబ్ ఏర్పాటు తో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అంశంపై అమెరికాలోని పలు ప్రముఖ ఐటీ కంపెనీలతో మంత్రి చర్చలు జరిపారు. ప్రస్తుతం ఆరు కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు, తొలి దశలో ఆ కంపెనీలు 200 ఉద్యోగాలను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మంత్రి పేర్కొంటున్నారు. ప్రస్తుతం పాత కలెక్టరేట్లో తాత్కాలికంగా ఐటీ హబ్ కార్యకలాపాలకు మౌలిక వసతులను సమకూర్చనున్నారు. ఈ మేరకు జగదీశ్ రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పాత కలెక్టరేట్ను పరిశీలించారు. తక్షణం భవనంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నెలాఖరులో లేకపోతే అక్టోబర్ 2 న ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటి హబ్ ను ప్రారంభించు కోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఐటి హబ్ తో పాటు పట్టణంలోని దోబీ ఘాట్ ,30 కోట్ల తో నిర్మించ నున్న రోడ్లు, డ్రైనేజీలు,ఇమాంపేట లో నిర్మిస్తున్న మల, మూత్ర శుద్ధి కేంద్రం శంకుస్థాపనల తో పాటు 80 కోట్ల తో నిర్మించిన మురుగు నీటి శుద్ధి కేంద్రం, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, డబల్ బెడ్ రూం ఇండ్లను ప్రాంభించ నున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లలలో నిమగ్నమయ్యారు.