బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ కీలక భేటీ

నవతెలంగాణ హైద‌రాబాద్: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పగా నిన్న ఒకే దఫాలో ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని వీడి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. దీంతో పార్టీలో అంతా అయోమయంగా మారింది. పార్టీలో కొనసాగే వారెవరో, వీడే వారెవరో ఎవరికీ అంతు చిక్కడం లేదు. గత రాత్రి ఎమ్మెల్సీల జంపింగ్ వ్యవహారం పార్టీలో సంచలనంగా మారగా ఇవాళ తెలంగాణ భవన్ లో అధిష్టానం నిర్వహించిన గ్రేటర్ బీఆర్ఎస్ నేతల మీటింగ్ కు ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు, 17 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం కొత్త చర్చకు దారితీసింది. చేరికలు ఇంతటితో ఆగలేదని త్వరలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతో చేతులు కలపడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న వేళ బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానించిన మీటింగ్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. దీంతో ఆ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ డైలామాలో పడినట్టు తెలుస్తోంది.
రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ సంద‌ర్భంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ బీఆర్ఎస్ నేత‌లు స‌మావేశం అయ్యారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మాగంటి గోపీనాథ్, మ‌హ‌ముద్ అలీతో పాటు జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు హాజ‌ర‌య్యారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ, భ‌విష్య‌త్‌లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. శనివారం జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం (కౌన్సిల్‌) ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పటికే మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

Spread the love