పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ కీలక నిర్ణయం..ఉచిత ల్యాప్‌టాప్‌లు

నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు బర్త్‌డే శుభాకాంక్షలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నారు. కేటీఆర్‌ తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటిలానే కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమే కాకుండా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తన పుట్టినరోజున పేద పిల్లలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. 10, 12వ తరగతి విద్యార్థులకు రెండేళ్లపాటు ల్యాప్‌టాప్, కోచింగ్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోమ్‌లోని అనాథలను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు 10, 12 తరగతుల్లో ప్రతిభ కనబరిచిన 47 మంది, ప్రొఫెషనల్ కోర్సులకు చెందిన మరో 47 మంది చిన్నారులను వ్యక్తిగతంగా ఆదుకుంటారు. ఈ విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ట్విట్టర్ వేదికగా ప్రతిజ్ఞ చేశారు. రెండేళ్లపాటు కోచింగ్‌ ఇస్తారు. కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Spread the love