– కొండా సురేఖ వ్యాఖ్యలు నాతో పాటు పార్టీకి నష్టం కలిగించాయి..
– వాటిని తిరిగి చెప్పలేను : కేటీఆర్
– కేటీఆర్, దాసోజు శ్రావణ్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన కోర్టు
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
మంత్రి కొండా సురేఖ పై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టులో బుధవారం కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనతో పాటు పార్టీకి కూడా తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని కేటీఆర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తనపై ఆమె చేసిన కామెంట్లను చూసి సాక్షులు తనకు ఫోన్ చేశారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని వాటిని విని షాక్‌కు గురయ్యానని తెలిపారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలను కొండా సురేఖ చేశారని కేటీఆర్ తన వాంగ్మూలంలో తెలిపారు. ఆమె మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా ఉన్నాయని చెప్పారు. తాను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అన్ని చెప్పలేకపోతున్నానని, ఫిర్యాదులో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కేటీఆర్ కోరారు. దాదాపు అరగంట పాటు కోర్టులో కేటీఆర్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కేటీఆర్‌తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్‌మెంట్‌ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్‌మెంట్ల రికార్డ్‌ను కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ నెల 21నే స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాల్సి ఉన్నప్పటికీ కేటీఆర్ అభ్యర్థన మేరకు గురువారం వరకు కోర్టు సమయమిచ్చింది. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ సహా ఈ కేసులో సాక్షులుగా ఉన్న దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, మాజీ మంత్రి జగదీష్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలు నాంపల్లి కోర్టుకు వచ్చారు.