సీబీఐ, ఎన్‌ఐఏ అరెస్టులపై కుకీ గ్రూపుల ఆగ్రహం

–  చురాచాంద్‌పూర్‌లో నిరవధిక బంద్‌ ప్రారంభం
న్యూఢిల్లీ : మణిపూర్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఐఏ అరెస్టుల పర్వం అక్కడి కుకీ గ్రూపులో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. జులై నెలలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల మృతి విషయంలో సంబంధం ఉన్నదన్న ఆరోపణలపై కుకీ తెగకు చెందిన నలుగురిని సీబీఐ అరెస్టు చేయటాన్ని కుకీ ప్రజలు తప్పుబడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యకు స్పందనగా కుకీ వర్గం చురాచాంద్‌పూర్‌ జిల్లాలో నిరవధిక షట్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. సీబీఐతో పాటు ఎన్‌ఐఏ కూడా ఒక కుకీ వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ విషయాన్ని మణిపూర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌ కూడా సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. చురాచాంద్‌పూర్‌ జిల్లాను షట్‌డౌన్‌ చేయాలని సంకల్పించినట్టు కుకీ సంస్థ ఇండిజీనియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరం (ఐటీఎల్‌ఎఫ్‌) ప్రకటించింది. ఎన్‌ఐఏ, సీబీఐలు అరెస్టు చేసిన వ్యక్తులను 48 గంటల్లో విడుదల చేయాలని ఐటీఎల్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

Spread the love