కులగణనే తొలి అడుగు..

Kulagane First step..– హిందీ బెల్ట్‌లో పాగాకు ఇండియా వ్యూహం
– బీజేపీకి చెక్‌ పెట్టే ఎత్తుగడ
ఇప్పుడు దేశంలో రాజకీయ వాతావరణం క్రమేపీ మారుతోంది. హిందీ రాష్ట్రాలలో బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రూపొందిస్తోంది. మతం పేరుతో భావోద్వేగాలను రగిలించి హిందూ ఓట్లను కొల్లగొడుతున్న బీజేపీ కుటిలత్వానికి చెక్‌ పెడుతోంది. మతం ముసుగులో హిందువుల్లోని అసమానతలను దాచిపెడుతున్న కమలనాథుల గుట్టు విప్పుతోంది. ఇందులో భాగంగానే బీహార్‌లో అధికారంలో ఉన్న ఐక్య జనతాదళ్‌, ఆర్జేడీ కూటమి కులగణనను విజయవంతంగా నిర్వహించి దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించింది.
న్యూఢిల్లీ : బీజేపీ హిందూ ఓటు బ్యాంకును బద్దలు కొట్టేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. హిందీ రాష్ట్రాలలో ముస్లింలతో పాటు వెనుకబడిన తరగతులు, దళిత హిందువులతో కూడిన బహుజనుల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తోంది. ఇప్పుడు ఇదే ఇండియా కూటమి గెలుపు వ్యూహమని చెప్పవచ్చు. 1990వ దశకంలో హిందీ ప్రాంతంలో వెనుకబడిన తరగతులు, దళితులు ఏకమయ్యారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత హిందూత్వ వాదం ప్రబలిన కాలం అది. అప్పుడు హిందీ ప్రాంతంలో ‘మండల్‌-కమండల్‌’ రగడ నడిచింది. ఓబీసీ కోటాపై మొట్టమొదటిసారిగా మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. దీనిని వెనుకబడిన తరగతుల రాజకీయాలకు ఓ చిహ్నంగా భావించారు. అయితే బీజేపీ తెలివిగా ‘మండల్‌-కమండల్‌’ వాదాన్ని సృష్టించి వెనుకబడిన తరగతుల వారు హిందూత్వ వైపు ఆకర్షితులయ్యేలా చేసింది.
కుల కోటాల విస్తరణే పరిష్కారం
కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు. దేశంలో ఉద్యోగాలు, ఉపాధి దొరకడం కష్టమైంది. ప్రజలను వ్యవసాయం నుండి పరిశ్రమల వైపు మరల్చడంలో మోడీ విఫలమయ్యారు. వెనుకబడిన హిందీ ప్రాంతంలో ఇది ప్రతికూల ప్రభావం చూపింది. జీవనోపాధి కోసం అనేక మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలసబాట పట్టారు. ఈ సమస్యకు కుల కోటాల విస్తరణే పరిష్కారమని ఇండియా కూటమి భావించింది. ఇది హిందూత్వ ముసుగులో ఉన్న బీజేపీ అసలు రంగును సైతం బయటపెడుతుందని కూడా నమ్ముతోంది. కనుక ఆ దిశగా తన వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో తొలి అడుగే బీహార్‌లో జరిగిన కులగణన. కులాల వారీ జనాభా లెక్కలు తేలితే వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు మరిన్ని ఆర్థిక, సంక్షేమ ప్రయోజనాలు పొందగలుగుతారు. రాజకీయంగానూ ఎదుగుతారు. ఉదాహరణకు బీహార్‌లో ఓబీసీల జనాభా 63%. ఇండియా కూటమి చెబుతున్న విధంగా అక్కడ ఓబీసీ కోటాను పెంచితే చట్టసభలలో ఇప్పటి వరకూ అగ్రవర్ణాల చేతిలో ఉన్న జనరల్‌ కేటగిరీ సీట్లు తగ్గిపోతా యి. వెనుకబడిన తరగతులు, ఎస్సీలు, ఎస్టీల స్థానాలు పెరుగుతాయి. ఇందుకు న్యాయ వ్యవస్థ కూడా అనుమతిస్తోంది. ఉదాహరణకు తమిళనాడులో 50% కోటా పరిమితి ఎప్పుడో దాటిపోయింది.

Spread the love