జూన్‌ 5నుండి కల్వకుర్తి లో కేవీపీఎస్‌ రాష్ట్ర శిక్షణా తరగతులు : కేవీపీఎస్‌

నవతెలంగాణ – కందనూలు
జూన్‌ 5నుండి కల్వకుర్తి లో కేవీపీఎస్‌ రాష్ట్ర శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు కేవీపీఎస్‌ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాలను జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న ఆధ్వర్యంలో విడుదల చేశారు.అ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవీపీఎస్‌ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణా తరగతులు జూన్‌ 5 6 7 తేదీలలో నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి దాని స్థానంలో మనుస్మృతిని ప్రాచిన భారత రాజ్యాంగం గా ప్రవేశపెట్టజూస్తుందన్నారు ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసనల్లోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా రిజర్వేషన్లు రద్దుకాబడి తద్వారా సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుందన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని సృష్టించడం ద్వారా దేశ ప్రజల మధ్య విభజనను రెచ్చగొడుతుందన్నారు. నూతన విద్యా విధానం పేరిట రిజర్వేషన్లు రద్దు చేసి డబ్బులున్న కొందరికి ఉన్నత విద్యను అందిస్తూ తిరిగి మనువాద విద్యా విధానాన్ని ప్రవేశపెట్టజూస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులపైన 300 రెట్లు దాడులు పెరిగాయని ఆయన వాపోయారు.రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని బిఆర్‌ఎస్‌ కార్యకర్తల ఫలహారంగా పంచుతుందని అర్హులైనటువంటి నిరుపేద దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళిత బందులో జరుగుతున్న అవినీతిపైన సమగ్ర దర్యాప్తు జరిపించి అవినీతికి పాల్పడిన నాయకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. ఈ తరగతులను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కెవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు చింత శివకుమార్‌, బాల చంద్రయ్య, మైబుస్‌, నరసింహ, రాములు, కృష్ణయ్య, ఎల్లమ్మ రాములమ్మ పాల్గొన్నారు.

Spread the love