ఏ గుండెను తాకుతుంది..నీ కన్నీటి చుక్క
ఏ మనసును కరిగిస్తుంది..నీ ఎండిన డొక్క
ఏ త్రాసు కొలుస్తుంది..నీ చెమట చుక్క
తలకాయలపై పిచ్చిగీతలు రాయించుకున్నట్టు
తరతరాలుగా స్వేదజల పాకుడు
మెట్లపై నిలదొక్కుకోలేక
పడుతూ, లేస్తూ, పలవరిస్తూ
పరిక్రమిస్తూ, పరిభ్రమిస్తూ
ఆకలిమంటల్ని చెమటచుక్కలతో
ఆర్పాలని అహోరాత్రులు ఆహుతైపోతూ
అలమటించే ఓ శ్రమయోగీ!
తలపాగా చుట్టి ముల్లుగర్ర పట్టి
అన్నం పెట్టే వృత్తి వృత్తంలో తిరుగుతూ
ప్రతీక్షణం ప్రకృతితో పోరాడుతూ
పుట్ల కొద్దీ ధాన్యం పండించావ్..
ఒక్కనాడైనా భార్యా పిల్లలతో
తప్తిగా తింటూ పండుగ చేసుకున్నావా..!
ఎక్కడ పనిదొరికితే అక్కడ కుదిరి
అనంత పని ప్రవాహానికి ఎదురీది..
అందమైన ప్రపంచాన్ని సజించావ్
ఒక్కరోజైనా చినిగిన చొక్కా తీసేసి
మాసిన గడ్డం గీసేసి కుటుంబంతో
స్వేచ్ఛా విహంగమై అవసరాలన్నీ తీరేలా
ఖర్చు పెట్టుకొని ఆనందించావా..!
నడువు.. నిన్ను దీవించే కొత్త ప్రపంచంలోకి
నినదించు.. శ్రమశక్తికి ఎదురే లేదని
నిరూపించు..
జగాన నీకు సాటి ఎవ్వరూ లేరని..
(మేడే సందర్భంగా..)
– భీమవరపు పురుషోత్తమ్
సెల్ : 9949800253