అధికారుల్లో లోపించిన సమన్వయం

ప్రజావాణికి తరలివచ్చిన
బాధితులు, అధికారులు
ముందస్తు సమాచారం ఇవ్వరా
అంటూ మండిపాటు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారుల మధ్య సమన్వయం లోపించింది. జిల్లా కలెక్టర్‌ నుండి మొదలుకొని అధికారుల వరకు సమన్వయం లేక ఇటు ప్రజలు, అటు అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిని ఈ వారం నిర్వహించకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కలెక్టరేట్‌కు తరలి వచ్చిన ప్రజలు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా వివిధ సమస్యలపై వచ్చిన బాధితులు మాత్రం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిని నిర్వహించడం లేదనే విషయాన్ని ముందస్తుగా తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రజావాణిని నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజా సమస్యలపై పట్టింపు లేదా అంటూ మండిపడుతున్నారు. కాగా ఈ వారం ప్రజావాణి నిర్వహించే సమయానికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎస్‌ శాంతి కుమారి వీడియో సమావేశం ఉండటం, ఆ వెంటనే వివిధ కార్యక్రమాలపై సమీక్షలు ఉండడంతో ప్రజావాణినిని నిర్వహించలేకపోయారని కలెక్టరేట్‌లోని ఓ అదికారి పేర్కొన్నారు. అయితే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు ముందస్తు ప్రకటన జారీ చేయకపోవడం.. ప్రజావాణికి హాజరుకావాలని కలెక్టరేట్‌లోని ఓ ప్రధాన అధికారి నుండి అధికారులకు ఫోన్లో సమాచారం వెళ్లడంతో ప్రజలు మాత్రమే కాకుండా వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు కలెక్టరేట్‌కు వచ్చి ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం వారి వంతయింది. చేసేదేమీ లేక వారంతా సమావేశ మందిరం బయటే నిల్చుని వెనుతిరి గారు. ఫిర్యాదుదారులు మాత్రం ఇన్‌ వార్డులో తమ ఫిర్యాదులను అందజేసినప్పటికీ అసహనం వ్యక్తం చేశారు. గత రెండు, మూడు వారాలుగా కలెక్టర్‌ను కలిసి తమ బాధలను చెప్పుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి జిల్లా కలెక్టరేట్‌కు వస్తే తీరా ఇక్కడ ఇన్వార్డ్‌ సెక్షన్‌లో ఫిర్యాదులను అందజేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ముందస్తుగా ప్రకటన రూపంలో విషయాన్ని తెలియజేస్తే ఇక్కడికి వచ్చేవారమే కాదని వాపోతున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, అందుబాటులో లేనప్పటికీ కలెక్టరేట్‌ ఫిర్యాదుదారులతో నిండిపోయింది. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love