ఏపీలో పంటల బీమా దారెటు?

Lack of crop insurance in AP?– తొలుత మోడీ పథకాలకు మార్గం వేసింది టిడిపినే
– స్వంతంగా అని.. తిరిగి వెనక్కొచ్చిన వైసిపి
– పదేళ్లుగా విపత్తు రైతును ఆదుకోని స్కీమ్‌లు
– ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది?
– గడుస్తున్న ఖరీఫ్‌
అమరావతి: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అమలైన పంటల బీమా స్థానే రైతులకు మరింత ప్రయోజనం కలిగించేలా మెరుగైన పథకాన్ని తెస్తామని టిడిపి కూటమి సర్కారు నిర్ణయించడంతో వ్యవసాయదారుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త పథకంపై అధ్యయనానికి ముగ్గురు మంత్రులతో కమిటీ వేయడంతోపాటు నెల రోజుల్లో సదరు కమిటీ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించడంతో రైతుల్లో ఒకింత కుతూహలంతో పాటు పలు సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటికే నెలన్నర ముగియగా, ఇంకో నెల రోజుల్లో బీమా పథకంపై మంత్రుల కమిటీని నివేదిక ఇవ్వమన్నారు. నెల రోజుల్లో నివేదిక వచ్చినా, ఉత్తర్వులొచ్చి కార్యాచరణలోకి రావాలంటే మరింత సమయం పడుతుంది. కొత్త పథకం వచ్చే వరకన్నా ప్రస్తుత పథకాలు ఉంటాయా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఒకవేళ సమయం మించిపోతే రైతులకు ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందన్న చర్చ మొదలైంది.
అప్పుడు సై అని..
మోడీ ప్రభుత్వం 2016లో, అంతకుముందున్న పంటల బీమా పథకాలను రద్దు చేసి ఫసల్‌, వాతావరణ ఆధారిత బీమా స్కీంలను ప్రవేశపెట్టింది. అప్పటివరకు కేంద్ర ప్రభుత్వరంగంలోని వ్యవసాయ పంటల బీమా సంస్థ (ఎఐఎస్‌) ఒక్కటే క్రాప్‌ ఇన్సూరెన్స్‌ను నిర్వహించగా, ఆ రంగంలోకి ప్రైవేటు కంపెనీలను చొప్పించింది. అప్పుడు ఎన్‌డిఎలో ఉన్న టిడిపి మన రాష్ట్రంలోనూ ఆ పథకాలకు జైకొట్టింది. వైసిపి వచ్చాక కేంద్ర పథకాల వలన రైతులకు న్యాయం జరగట్లేదని చెప్పి స్వంతంగా పంటల బీమాను 2019 రబీ నుంచి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించింది. అయితే కేంద్ర పథకాల గైడ్‌లైన్స్‌నే ఇక్కడా పాటించింది. రైతుల తరఫున ప్రీమియాన్ని తానే చెల్లించి ఉచిత పంటల బీమా అమలు చేసింది. అంతేకాకుండా ఎపి ప్రభుత్వం స్వంతంగా ఇన్సూరెన్స్‌ కంపెనీని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేయగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ వద్ద మోకాలడ్డింది. దాంతో పాటు రైతుల ప్రీమియంలో భరించాల్సిన తన వాటా నిధులివ్వకుండా బిగబట్టింది. కేంద్ర పథకాల్లో చేరాలన్న కేంద్ర ఒత్తిడికి తలొగ్గిన వైసిపి ప్రభుత్వం 2022 ఖరీఫ్‌ నుంచి తిరిగి కేంద్ర పథకాల్లో చేరింది. మళ్లీ ప్రైవేటు కంపెనీలు వచ్చి పడ్డాయి. కాగా ఇప్పటి వరకు 2022-23 రబీ, 2023 ఖరీఫ్‌, 2023-24 రబీ క్లెయిములు చెల్లించలేదు. టిడిపి హయాంలో, వైసిపి స్వంతంగా నిర్వహించిన పథకాల్లో, అనంతరం కేంద్ర పథకాల్లో విపత్తుల వల్ల వాస్తవంగా నష్టపోయిన రైతులందరికీ బీమా దక్కలేదు.
కేంద్రాన్ని కాదంటుందా?
ఇ-క్రాప్‌లో నమోదే అర్హతగా వైసిపి సర్కారు బీమాను అమలు చేయడం మూలంగా గుర్తింపునకు నోచుకోని కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. సాంకేతిక కారణాలు, సిబ్బంది తప్పిదాలు, నిర్వహణా లోపాలు, ఎర్రర్స్‌ వలన పెద్ద సంఖ్యలో భూమి కలిగిన రైతులు సైతం బీమా కోల్పోయారు. ఈ అంశాలపై టిడిపి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రైతుల భాగస్వామ్యంతో బీమా అంటోంది సర్కారు. దాంతో ఉచిత పంటల బీమా అమలవుతుందా లేదా అన్న భయాలు రైతుల్లో కలుగుతున్నాయి. ఇ-క్రాప్‌ను ఎత్తేసి గతంలో మాదిరి బ్యాంకుల్లో రుణాలు తీసుకునే సమయంలోనే రైతుల నుంచి ప్రీమియం మినహాయించుకునే పద్ధతిని ప్రవేశపెడతారా? అలా అయితే ప్రీమియాన్ని రైతులే భరించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో లోన్లు ఇవ్వని కారణంగా కౌలు రైతులకు ఇక్కడా నష్టం వాటిల్లుతుంది. ఒక వేళ ఉచిత పంటల బీమా అయితే రైతుల వాటా ప్రీమియాన్ని ప్రభుత్వం రైతుల అకౌంట్‌లో డిబిటి పద్ధతిలో జమ చేయాల్సి ఉంటుంది. నాన్‌-లోనీ ఫార్మర్స్‌కు బీమా అవకాశం ఉన్నా అది రైతుల ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కేటగిరీలోకి కౌలు రైతులొచ్చినా ప్రీమియం భారం వారిపైనే పడుతుంది. ఈ కేటగిరీలో ఉన్న కౌలు రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వం పెట్టుకుంటేనే వారికి న్యాయం జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే… మోడీ ప్రభుత్వం 2016లో ఫసల్‌ బీమాను ప్రవేశపెట్టినప్పుడు దాన్ని టిడిపి సర్కారు రాష్ట్రంలో అమలు చేసింది. వైసిపి సర్కారు ఆ పథకం వద్దన్నా ఒత్తిడి చేసి మరీ తిరిగి కేంద్ర పథకాల్లో చేర్చింది బిజెపి సర్కారు. ఇప్పుడు కేంద్ర పథకాలను కాదని ఎన్‌డిఎలో ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వం ముందుకెళుతుందా అనేది అతి పెద్ద సందేహం.

Spread the love