– ముందే ఒప్పందం…ఆ పైన హడావుడి..
– ఫిర్యాదు చేసిన అర్ధగంటకే గ్రామానికి అధికారులు..
– ఫిర్యాదుదారులకు ముందస్తు సమాచారం లేకుండా దిగిన అధికారులు బృందం..
– నా పై చర్యలు తీసుకుంటే మీ వాయిస్ రికార్డుల చిట్టా విప్పుతా….
– ఇప్పటికే పలు రికార్డులు చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వైనం..
నవతెలంగాణ – చివ్వేంల
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు గ్రామ కార్యదర్శి పై ఇటీవల అధికారులు చేసిన విచారణను చూసిన వ్యక్తులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు…. ఓ జిల్లా స్థాయి అధికారులు ఇద్దరు, మండల స్థాయి అధికారులు మరో ఇద్దరు ఎంతో అనుభవం కలిగిన ఈ అధికారులు కార్యదర్శి పై పలు అక్రమ అవినీతి పై విచారణ చేయడానికి కనీసం శాఖపరమైన నిబంధనలు పాటించలేదని విమర్శలు వస్తున్నాయి… సాధారణంగా ఎవరైనా ఓ అధికారిపై అక్రమాలు , అవినీతి కి పాల్పడ్డాడని సదరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు… ఆ ఫిర్యాదులు అందిన వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయాలి… అనంతరం ఏ గ్రామ అధికారిపై ఆరోపణలు వచ్చాయో ఆ గ్రామంలో ఏరోజైతే విచారణ చేస్తున్నారో ఆ రోజుకు ఒక రోజు ముందు ఫిర్యాదుదారులకు నోటీసులు గాని, ఎవరైనా ప్రభుత్వ వ్యక్తుల ద్వారా సమాచారం అందిచాలి. ఫిర్యాదు దారులకు ఎలా నష్టం జరిగింది. దానికి ఆ అధికారి ఎలా కారణమయ్యాడు, అతను పని చేస్తున్న కార్యాలయంలో రికార్డులను పరిశీలించి నిజంగా అవినీతి జరిగిందా లేదా కూలంకషంగా పరిశీలించాల్సి ఉంది…. కానీ అలాంటి పట్టింపులు ఏం లేకుండా మొదటగా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, ఎంపీడీవో, ఎంపీవో లకు గ్రామస్తులు పెద్డ ఎత్తున వెళ్లి ఫిర్యాదు చేసి వారు మండల కేంద్రం నుండి గ్రామానికి వచ్చేలోపే 4గురు అధికారుల బృందం లాలూచీ విచారణ చేసి ఆ కార్యదర్శిని కాపాడారని ఫిర్యాదు దారులు ఆరోపిస్తున్నారు … కార్యదర్శి తన అనుబంధంగా ఉండే 30 మందిని పిలిపించుకొని అధికారులకు తన పనితీరు బాగుందని చెప్పించుకొని ఫిర్యాదు దారులు కాకుండా సంబంధం లేని వ్యక్తులతో సంతకాలు పెట్టించుకుని విచారణ ముగించుకొని రావడం దుర్మార్గమైన చర్య అని గ్రామస్తులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు… ఆ గ్రామ కార్యదర్శి అక్రమాలపై విచారణకు వచ్చిన అధికారులపై వారి తీరుపై పలు రకాల అనుమానాలు, ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
లాలూచీ విచారణ..
కార్యదర్శి పై మొదటి రోజు ఆరోపణలు వచ్చిన వెంటనే స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి పిలిచి రూ.1లక్ష డీల్ జరిగినట్టు భారీ ఎత్తున సోషల్ మీడియాలో కొన్నిరకాల పోస్టులు విపరీతంగా ప్రచారంలో ఉన్నాయి… అదే శాఖ లోని ఓ ఉన్నతాధికారి పేరు చెప్పి లంచంగా తీసుకున్నారని దీనికి ఎంపీడీవో కార్యాలయంలోని వ్యక్తి మధ్యవర్తిత్వం చేశాడని ఇటీవల సోషల్ మీడియా కోడై కూసింది. ప్రస్తుతం గుంజలూరు గ్రామంలో విచారణ పేరుతో హడావుడి చేసి ఆ గ్రామ కార్యదర్శిని కాపాడే ప్రయత్నం చేసిన అధికారుల ప్రవర్తన చూస్తుంటే ఒప్పందం కుదిరింది కాబట్టే ఇలా లాలూచీ విచారణ చేసి చేతులు దులుపుకొని అతనిని కాపాడారని కొందరు గ్రామస్తులు బహిరంగంగానే చెప్తున్నారు.
ఉన్నతాధికారులు నాతో మాట్లాడిన రికార్డుల చిట్టా నా దగ్గర ఉంది..
తనతో కొన్ని సమయాల్లో కొందరు వ్యక్తుల గురించి కొన్ని రకాల నిధుల గురించి ఉన్నతాధికారులుగా తనతో మాట్లాడిన రికార్డులు చేసి తన దగ్గర పెట్టుకున్నానని, నాపై చర్యలు తీసుకుంటే ఆ రికార్డులను తనకు చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఉన్నతాధికారులని సైతం బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనకాడనని గ్రామ కార్యదర్శి గ్రామంలో అతని అనుచరులతో చెబుతున్నట్లు సమాచారం…ఆల్రెడీ ఓ అధికారిపై బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. తనకు అనుచరుడైన ఓ వ్యక్తి బ్లాక్ మెయిల్ కు ఎవరైనా లొంగల్సిందేనని కార్యదర్శి బాహాటంగానే చెబుతుండడం విశేషం… అయినప్పటికీ ఇతనిపై చర్యలు తీసుకోవడంలో మాత్రం ఉన్నతాధికారులు కాస్త జంకుతున్నారనే వార్తలు వస్తున్నాయి…
తోటి కార్యదర్శులను ఇబ్బంది పెట్టిన ఘనుడు..
గత ప్రభుత్వం లో అప్పటి అధికార పార్టీ నాయకుడిని అండ చూసుకొని తనకు ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయాడు ఈ కార్యదర్శి…. ఇతను గతంలో ఆ సంఘం మండలాధ్యక్షుడిగా చేసిన సమయంలో కొందరి వద్ద నుండి ఖర్చుల పేరుతో కొంత నగదు వసూలు చేసి తన స్వంతానికీ వాడుకున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… ఇతని మాటలు వినని వారిపై తన అనుచరులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి వారిని చిత్రహింసలకు గురిచేశాడనే ఆరోపణలు ఉన్నాయి… ఇప్పటికైనా ఇతనిపై చర్యలు తీసుకోకుంటే మున్ముందు ఇంకా ఎన్ని అరాచకాలు చేస్తాడోనని పలువురు బాహాటంగానే అంటున్నారు.
మరోసారి కార్యదర్శి పై గ్రామస్తుల ఫిర్యాదు
గుంజలూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి పై గతంలో ఇచ్చిన ఫిర్యాదుల్లో ఫోన్ నెంబర్ లేవని వారి సంతకాలు బట్టి వారి అడ్రస్ ను గుర్తించలేకపోయామని మాయమాటలు చెప్పి లాలూచీ విచారణ చేసి చేతులు దులుపుకున్న అధికారుల తీరుతో విసుగుచెందిన గ్రామస్తులు తిరిగి గురువారం నాడు ఫోన్ నెంబర్లతో సహా వారి సంతకాలను పెట్టి కొందరు స్వయంగా రాసిన ఫిర్యాదు పత్రాలను జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పంచాయతీరాజ్ అధికారి సురేష్ కుమార్ కు, చివ్వెంల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సెక్షన్ అధికారికి ఎండను సైతం లెక్కచేయకుండా ఫిర్యాదు పత్రాలు అందజేసినట్లు సమాచారం.
విచారణకు మమ్మల్ని పిలవకుండానే చేయడం వెనుక మతలబు ఏంటి..
సుంకరి ఉపేందర్, మాజీ వార్డు సభ్యుడు, గుంజలూర్ గ్రామం గ్రామపంచాయతీ కార్యదర్శిపై తాము జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు అధికారులకు ఫిర్యాదు చేసి గ్రామానికి చేరుకునేలోపే విచారణ ముగుంచుకొని అధికారులు వెళ్లడం దుర్మార్గం… దీంతో మరల తిరిగి గురువారం ఉన్నతాధికారులు కు పిర్యాదు చేశాం.. ఈ సారైనా మాకు ముందస్తుగా సమాచారం ఇచ్చి విచారణ చేయాలి… లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం… ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఈ అధికారి తీరుతో వివాదాలు తలెత్తే పరిస్థితి వచ్చింది. ఇతనిపై విచారణ చేసిన అధికారుల తీరు సరిగా లేదు వారు తీరు అనుమాన పూరితంగా ఉంది.