– అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్న కమీషనర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపల్ లో కోట్ల రూపాయల అవినీతి భూ కుంభకోణం వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆయా తహసిల్దార్ లు ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా నివాస గృహాల నిర్మాణం నిమిత్తం పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా పట్టాలు పొందిన వారు ఇళ్ళను నిర్మించుకొని మున్సిపాలిటీ వారికి ఇంటి నెంబర్ నిమిత్తం దరఖాస్తు చేసుకుంటే వారికి, ఇంటి పన్ను రశీదు యందు ఓల్డర్ ఆఫ్ ద ప్రిమిసెస్/ ఆక్యూపయ్యర్ లేదా ప్రజెంట్ ఆక్యూపయ్యర్ అని పేర్కోంటూ.. ఇంటి నెంబర్ కేటాయించడం జరుగుతుంది. ఇంటి టాక్స్ రశీదు యందు ఇంటి యజమాని పేరు లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ పరంగా క్రయ విక్రయాలకు చోటు లేకపోవడంతో కేవలం పట్టాదారుడు మాత్రమే నివాసం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను రశీదులో వ్యక్తి యొక్క ఇంటి పేరు, వ్యక్తి పేరు సవరణకు ఓక వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించింది. ఇట్టి అవకాశాన్ని మాజీ యూ డి ఆర్ ఐ తనకు అనుకూలంగా మలచుకొని ప్రజేంట్ ఆక్యుపయ్యర్, ఓల్డర్ ఆఫ్ ద ప్రిమిసెస్ ఆక్యూపయ్యర్ ఉన్న స్థానంలో నేరుగా వ్యక్తి యొక్క పేరు చేర్చడం వల్ల పెద్ద మొత్తంలో ప్రభుత్వ/ ప్రైవేటు ఆస్తులు క్రయ విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ రకమైన ప్రక్రియ ఇందిరమ్మ ఫేస్ -1, ఇందిరమ్మ ఫేస్ -2 , జక్కయ్య నగర్- హనుమాన్ వాడ తదితర ప్రాంతాల్లో కూడా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో అవినీతి భూకుంభకోణం జరిగినట్టు సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వెబ్సైట్ దుర్వినియోగం కారణమైన అధికారులపై చర్యలు తీసుకోని, కేటాయించిన పేర్లను రద్దు చేయాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
అక్రమాలకు పాల్పడిన వారికి నోటీసులు జారీ చేశాం: మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి..
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మున్సిపల్ ఉద్యోగుల సహకారంతో ప్రజెంట్ ఆక్యుపైయర్ అని కాకుండా తమ పేర్లను నమోదు చేయించుకున్నారని అది మా దృష్టికి రావడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నోటీసులు జారీ చేశామని మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న నాలుగు సబ్ డాక్యుమెంట్లను రద్దు చేశామని, ప్రధాన డాక్యుమెంట్ రద్దు చేయడానికి ప్రాసెస్ జరుగుతుందన్నారు. అలాగే మున్సిపల్ మాజీ యు డి ఆర్ (అప్పటి డివిజన్ రెవిన్ ఇన్స్పెక్టర్) కి నోటీసులు జారీ చేశామని, అతనిపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సంబంధిత స్థలంలో మున్సిపాలిటీ బోర్డు ఏర్పాటు చేశామని, అక్రమ రిజిస్ట్రేషన్ లపై భువనగిరి సబ్ రిజిస్టార్కు నోటీసులు పంపించామని, సిడిఎంఏ కు రిపోర్ట్ చేశామని తెలిపారు.