లష్కర్‌ బోనాల్లో సీఎం

– ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో కేసీఆర్‌ దంపతులు
– అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌
– తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని
– ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి
– బంగారు బోనంతో ఎమ్మెల్సీ కవిత
– నేటి భవిష్యవాణికి ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో, బేగంపేట
సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి దర్శనానికి సందర్శకులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. మహిళల కోలాటాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుల దరువులు, యువతీ యువకుల నృత్యాల కోలాహలాలు, ఆనందోత్సవాల నడుమ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అదివారం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది మహిళలు, భక్తులు, సందర్శకులు అమ్మవారికి బోనాలు , తొట్టెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 1.20గంటలకు ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌ తదితరులున్నారు. అంతకుముందు ఉదయం 4.15 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, తన కుటుంబ సభ్యులతో దేవాలయానికి రాగా ఆయన సతీమణి స్వర్ణ బోనంతో అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం సాధారణ భక్తులకు అనుమతించారు. మహంకాళి బోనాల జాతర విశ్వవ్యాప్తమైందని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా మంత్రి తలసాని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ముందుగా మంత్రి తలసాని నివాసం గాస్‌ మండిలో ప్రత్యేక పూజలు చేసిన కవిత అనంతరం డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ నివాసం నుంచి బంగారు బోనంతో మహంకాళి ఆలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కవిత వెంట మంత్రులతో పాటు బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి కేశవరావు, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ చీర సుచిత్ర శ్రీకాంత్‌ తదితరులున్నారు.
అమ్శవారిని దర్శించుకున్న ప్రముఖులు
ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, బీజేపీ నాయకులు ఈటల రాజేందర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు దానం నాగేందర్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, పద్మా దేవేందర్‌ రెడ్డి, కాలేరు వెంకటేష్‌, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, సికింద్రాబాద్‌ ఆర్డీవో వసంత కుమారి తదితరులు పాల్గొన్నారు. బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని రోడ్ల నుంచి ఇతర మార్గాల వైపు ట్రాఫిక్‌ను మళ్లించారు.

Spread the love