వాషింగ్టన్ : గతేడాది కాలంలో అమెరికా వ్యాప్తంగా పోలీసులు 1250మందికి పైగా హతమార్చారని పరిశోధనా గ్రూపు మ్యాపింగ్ పోలీస్ వయొలెన్స్ వెల్లడించింది. 2013 నుండి దేశంలో పోలీసుల హత్యల వివరాలను నమోదు చేస్తూ వచ్చిన ఈ సంస్థ ఆయా గణాంకాలను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ ఇంతమంది చనిపోలేదని పేర్కొంది.
ప్రభుత్వ రికార్డులు, వార్తా కథనాల ద్వారా పోలీసుల హత్యల వివరాలను ఈ సంస్థ తెలుసుకుంటూ వుంటుంది. గతేడాది డిసెంబరులో చివరి 13 రోజుల్లో పోలీసులు ఒక్కరిని కూడా చంపలేదని పేర్కొంది. సగటున ప్రతి 7గంటలకు ఒకరు చొప్పున పోలీసుల హింసలో చనిపోయారని ఈ గ్రూపు గుర్తించింది. పోలీసుల కాల్పులు, లాఠీచార్జి, పోలీసు వాహనాలు ప్రజలపైకి దూసుకెళ్ళడం వంటి ఘటనల్లో మరణించిన వారే వీరందరూ. వీరిలో దాదాపు 31శాతం అంటే 387మంది
హింసాత్మక నేరాల్లో మరణించారు. మరో 18శాతం మంది అంటే దాదాపు 200మంది ట్రాఫిక్ ఉల్లంఘనల ఆరోపణలపై లేదా సంక్షేమ తనిఖీల కోసం పోలీసులను పిలిచిన తర్వాత చంపబడ్డారు. మరో 8శాతం మంది ఎలాంటి నేరాలకు పాల్పడకపోయినా చనిపోయారు. హింసాత్మక యేతర నేరాలకు పాల్పడిన వారు మరో 17శాతం మందని ఆ గ్రూపు పేర్కొంది. గ్రామీణ, శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ హత్యలు చోటు చేసుకున్నాయి.