లాస్య నందిత యాక్సిడెంట్.. కీలక ఆధారాలు లభ్యం

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారును ఢీకొన్న టిప్పర్ లారీనీ పటాన్‌చెరు పోలీసులు  గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్‌ను ఢీకొనడం వల్లే లాస్య నందిత మృతి చెందారు. ప్రస్తుతం టిప్పన్‌ను పోలీసులు సీజ్ చేశారు. కాగా.. ఫిబ్రవరి 27న పటాన్‌చెరు పరిధిలోని ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని రింగ్‌రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత (37) దుర్మరణం చెందారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు.. గుర్తుతెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొని అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపు దూసుకెళ్లి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది. ప్రమాదం తీవ్రతకు వాహనం ముందువైపు ఎడమ భాగం నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న ఆమె పీఏ ఆకాశ్‌ (26) తీవ్రంగా గాయపడ్డారు. రెండు కాళ్లూ విరిగిపోవడంతో ఆయన కారులోనే ఇరుక్కుపోయారు. డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చున్న నందిత సీటు బెల్ట్‌ పెట్టుకున్నా, ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నా.. ఆమె తలకు, ముఖానికి, కాళ్లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే లాస్య తండ్రి మాజీ ఎమ్మెల్యే జి.సాయన్న గత ఏడాది ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మరణించారు. ఆయన ప్రథమ వర్థంతి జరిగి నాలుగు రోజులు గడవక ముందే కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Spread the love