హామీల అమలుపై అలసత్వం..!

Laxity on the implementation of guarantees..!– కార్మికులకు నెరవేరని సొంతింటి కల
– మారుపేర్ల సవరణలోనూ తీవ్రజాప్యం
– అపరిష్కృతంగా సింగరేణి కార్మికుల సమస్యలు
– నేడు మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన
– త్వరలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు
సింగరేణి కార్మిక క్షేత్రంలో సమస్యలు యథాతథంగా ఉన్నాయి. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సందిగ్ధం నెలకొంది. 2018లో సింగరేణి ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కార్మికుల సొంతింటి కల నెరవేరకపోవడం.. మారుపేర్ల సవరణలోనూ తీవ్ర జాప్యం కావడం వంటి సమస్యలు అలాగే ఉన్నాయి. మరోపక్క ఈనెల 28వ తేదీన సింగరేణి ఎన్నికలు నిర్వహిం చేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తుండటంతో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురు కానుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కొత్త గనుల ప్రారంభం తప్పితే ఏదీ పరిష్కారం కాలేదు. ఆదివారం మంత్రి కేటీఆర్‌ మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, రామకృష్ణాపూర్‌ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
నల్లబంగారు నేలగా పిలువబడే సింగరేణిలో కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మరోపక్క 2018 ఏడాదిలో సింగరేణి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు హామీలు గుప్పించింది. ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌)ను గెలిపిస్తే వివిధ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పించింది. ఆరు కొత్త గనులను ప్రారంభిస్తామని, బ్లాక్‌లను సింగరేణికే అప్పగిస్తామని, కార్మికుల మారుపేర్లు సవరిస్తామని, వారసత్వ ఉద్యోగాలకు అర్హత వయసును 35ఏండ్ల నుంచి 40ఏండ్లకు పెంచుతామని, ఒక్కో కార్మికుడికి రూ.10లక్షలు వడ్డీలేని రుణం అందిస్తామని హామీనిచ్చింది. పది వేల కొత్త క్వార్టర్ల నిర్మాణంతోపాటు కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని ఆ సంఘం కార్మిక నేతలు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం హామీలతో మెజార్టీ డివిజన్లల్లో టీబీజీకేఎస్‌కే కార్మికులు మద్దతు పలికి గెలిపించారు. కానీ, ఇచ్చిన హామీల్లో కొన్ని కొత్త గనులను తెరిపించిన ప్రభుత్వం మిగతా వాటిని విస్మరించిందనే ఆరోపణలున్నాయి. మరోపక్క వడ్డీలేని రుణం స్థానంలో కార్మికులే రుణం తీసుకుంటే కంపెనీనే ఆ రుణానికి వడ్డీ చెల్లిస్తుందని చెబుతుండటం కార్మికుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మరోపక్క మారుపేర్ల సవరణ లేకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
మంత్రి పర్యటనపై ఆశలు..!
మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్‌లో మంత్రి కేటీఆర్‌ ఆదివారం పర్యటించనున్నారు. పలు అభివృధ్ధి పనులను ప్రారంభించనున్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఇదే నెల చివరి వారంలో జరగనున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తారని.. వాటి పరిష్కారానికి భరోసా లభిస్తుందని కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. వారసత్వం కోల్పోయిన వారు సుమారు వంద మంది ఉంటారు. వీరికి ఇప్పటి వరకు ఉద్యోగాలు కల్పించలేదు. ఏండ్ల నుంచి ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నా ఇప్పటికీ నెరవేరడం లేదు. తాజాగా వీరి ఉద్యోగాల కల్పన అంశంపైనా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. మరోపక్క ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో మరోసారి టీబీజీకేఎస్‌ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోంది. ఈ తరుణంలో గతంలో ఇచ్చిన హామీల్లో అనేకం అపరిష్కృతంగా ఉన్నాయి. ఫలితంగా టీబీజీకేఎస్‌ తరపున పోటీ చేసే ఆశావహులకు ఈ సమస్య ఇబ్బందికరంగా మారనుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్‌ జిల్లాలో పర్యటిస్తున్న దృష్ట్యా గతంలో ఇచ్చిన హామీలపై అమలుపై నిర్ణయం వెలువరిస్తారని కార్మికులు భావిస్తున్నారు. కొత్తగా ఇంకా ఏమైనా హామీలు ఇస్తారా అని కార్మికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రి నుంచి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని కార్మికవర్గంలో చర్చ జరుగుతోంది.

Spread the love