అన్నదాతల సమస్యలపై అలసత్వం

Laxity on breadwinner issues– ఎంఎస్‌పీపై సర్కారు కుంటిసాకులు
– ఆ మూడు పంటలకే మద్దతు ధరలు పరిమితం
– ఆర్థికంగా నష్టపోతున్న ఇతర పంటల రైతులు
న్యూఢిల్లీ : పోలీసులు, పారా మిలటరీ దళాలు ఎన్ని రకాలుగా నిర్బంధాలు పెడుతున్నప్పటికీ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధానిలో ప్రవేశించేందుకు అన్నదాతలు కృతనిశ్చయంతో ప్రయత్నిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం రైతులు సాగించిన సుదీర్ఘ పోరాటం ఇప్పుడు మళ్లీ గుర్తుకు వస్తోంది. అయితే ప్రస్తుతం రైతులు చేస్తున్న డిమాండ్లలో కొంత తేడా ఉంది. ఆ నాడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతన్నలు ఆందోళన జరిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం పంటల కనీస మద్దతు ధరలకు (ఎంఎస్‌పీ) చట్టపరంగా గ్యారంటీ ఇవ్వాలని వారు ప్రధానంగా కోరుతున్నారు. దీనితో పాటు రుణమాఫీ, పెన్షన్‌, ఉపాధి హామీ చట్టంలో అదనపు నిబంధనలు వంటి ఇతర డిమాండ్లను కూడా వారు ముందుకు తెస్తున్నారు. గ్రామీణ ఉపాధిని, దేశ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను కూడా వారు తమ నిరసన పరిధిలో చేర్చారు.
అన్నదాతల్లో 85% మంది చిన్న కమతాలు కలిగిన వారే. వీరు అరకొర ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వీరికి ఐదు ఎకరాల కంటే తక్కువ భూమే ఉంది. ఇక మిగిలిన రైతులు కూడా కేవలం వ్యవసాయం పైనే ఆధారపడి లేరు. వీరిలో చాలా మంది వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే రైతులు కేవలం వ్యవసాయ ఆదాయంతోనే మనుగడ సాగించడం లేదు.
ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడం వల్లనే రైతులు రాజధాని వైపు కదిలారు. 2022లో ఇచ్చిన హామీలే అమలుకు నోచుకోకపోవడంతో ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం కలగడం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీకి నేటికీ అతీగతీ లేదు. ఎంఎస్‌పీ, వ్యవసాయ సంస్కరణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీపై రైతులెవ్వరూ ఆశలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే దానిని బీజేపీ అనుకూల సభ్యులతో నింపేశారు. రైతు సంఘాలన్నీ దానిని బహిష్కరించాయి.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ఉత్పత్తి వ్యయాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకొని అన్ని పంటలకూ ఎంఎస్‌పీని కల్పించాలన్న రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అలా ఇచ్చినప్పుడే తాము నష్టాల బారి నుండి లాభాల బాట పడతామని రైతన్నలు చెబుతున్నారు. అయితే ఈ ప్రధాన డిమాండ్‌ను వ్యతిరేకించడానికి ప్రభుత్వం కొన్ని కారణాలు చూపుతోంది. అవేమిటంటే… దీనివల్ల రూ.10 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది పాలనాపరంగా సాధ్యం కాదు. ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లు ఆపేస్తారు. దీనివల్ల రైతులు నష్టపోతారు. ప్రస్తుతం ధాన్యం, గోధుమలను మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోంది. అలాంటప్పుడు ఇతర పంటలకు ఎంఎస్‌పీ ఎలా అమలు చేస్తారు? బడా రైతులకు మాత్రమే ఎంఎస్‌పీ లభిస్తుంది. డబ్ల్యూటీఓలో సమస్యలు ఎదురవుతాయి….ఇవన్నీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు.
ఆ మూడు పంటలపైనే దృష్టి
ఇప్పుడు వాస్త వాలేమిటో పరిశీలిద్దాం. ప్రస్తుతం 23 పంటలకు ఎంఎస్‌పీ వర్తిస్తోంది. కానీ వరి, గోధుమ పంటలకు మాత్రమే అమలవుతోంది. చెరకు పండించే రైతులకు చక్కెర మిల్లులు ధర చెల్లిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వరి, గోధుమ, చెరకు పంటలకు అక్కడి వాతావరణం అనుకూలంగా లేకపోయినా రైతులు వాటినే సాగు చేస్తున్నారు. ఈ పంటలకే కనీస ధర లభించడం దీనికి కారణం. ఉదాహరణకు మహారాష్ట్రలో నీటి ఎద్దడి అధికంగా ఉండే ప్రాంతాల్లో చెరకును సాగు చేస్తున్నారు. పంజాబ్‌లో వరి పంట పరిస్థితి కూడా అదే. ఫలితంగా వరి, గోధుమ, చెరకు పంటల ఉత్పత్తి అవసరమైన దాని కంటే అధికంగా ఉంటోంది. ప్రభుత్వం వద్ద నిల్వలు పేరుకుపోతున్నాయి. స్టోరేజీ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో వృథా జరుగుతోంది. పంట ఉత్పత్తుల సేకరణ, నిల్వ, ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం విడుదల చేయడం వంటి పనుల కోసం ఎఫ్‌సీఐకి పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి ఏకైక కారణం ఆ మూడు పంటలకు మాత్రమే మద్దతు ధర లభించడం.
అన్ని పంటలకూ వర్తింపచేస్తే…
అన్ని పంటలకూ ఎంఎస్‌పీని వర్తింపజేస్తే వాతావరణానికి అనుకూలించే పంటలనే రైతులు పండిస్తారు. దీనివల్ల కొన్ని పంటల ఉత్పత్తుల నిల్వలు పేరుకు పోవడాన్ని నివారించవచ్చు. కొన్ని పంట ఉత్పత్తులను పెద్ద ఎత్తున నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. దేశంలో చమురు గింజల సరఫరా తక్కువగా ఉన్నందున ఆ పంటల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. కొన్ని పంట ఉత్పత్తులను దిగమతి చేసుకువాల్సిన అవసరం కూడా ఉండదు. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు అందుబాటులో ఉన్న స్థలం ఇతర పంటలకు లభిస్తుంది.
డిమాండ్‌, సరఫరాలే కీలకం
ఎంఎస్‌పీ కంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎందుకు తక్కువగా ఉంటున్నాయి? వ్యవసాయోత్పత్తుల ధరలను డిమాండ్‌, సరఫరా నిర్ధారిస్తాయి. ఉదాహరణకు పంట కోతల తర్వాత ఉత్పత్తులు వరదలా మార్కెట్‌లోకి వచ్చి పడతాయి. ఫలితంగా ధరలు పడిపోతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ అందిస్తున్నప్పటికీ దేశంలో 30% మంది మహిళలు, చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పేదరికం అధికంగా ఉండడంతో డిమాండ్‌ తగ్గిపోతోంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ధరలు తక్కువగా ఉండడంతో 2022లో రైతులు రూ.14 లక్షల కోట్లు నష్టపోయారని ఓ సర్వే చెబుతోంది. రైతులకు అందజేస్తున్న సబ్సిడీకి ఇది మూడున్నర రెట్లు అదనం. అందుకే ఎంఎస్‌పీ, సేకరణ, పంపిణీ అనేవి కీలకంగా మారాయి.
వ్యవసాయ సబ్సిడీలు తగ్గించొచ్చు
జీవనానిని అవసరమైన వేతనాలకు రాజ్యాంగం హామీ ఇస్తోంది. అదే లభిస్తే వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయి. వాటి ధరలు ఎంఎస్‌పీ కంటే ఎక్కువగా ఉంటాయి. అప్పుడు రైతన్నలు వ్యవసాయ కార్మికులకు మంచి వేతనాలు అందించగలుగుతారు. అయితే అధిక వేతనాలు, ధరలు ద్రవ్యోల్బణ పెరుగుదలకు కారణమవుతాయి. పరోక్ష పన్నులను తగ్గించి, ప్రత్యక్ష పన్నులను పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అంతా సజావుగా ఉంటే వ్యవసాయ సబ్సిడీలను తగ్గించవచ్చు. ఆ మొత్తాన్ని విద్య, ఆరోగ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ, మౌలిక సదుపాయాలకు మళ్లించవచ్చు.
పారిశ్రామిక రంగంపై ప్రేమ
సబ్సిడీలు అవాంఛనీయమని కొందరు చెబుతారు. కానీ విద్య, ఆరోగ్యం తదితర రంగాలకు అవి ఎంతో అవసరం. కానీ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఉదాహరణకు పీఎల్‌ఐ పథకం ద్వారా ప్రభుత్వం బడా కార్పొరేట్‌ సంస్థలకు సబ్సిడీలు ఇస్తోంది. వాస్తవానికి వాటికి అవి అవసరం లేదు. వీటినే పన్ను వ్యయాలు అంటారు. 2021లో ఈ పద్దు కింద రూ.448 లక్షల కోట్లు ఖర్చు చేశారు. భూమి, నీరు, విద్యుత్‌తో వ్యాపారం చేసే వారికి సబ్సిడీలు ఇస్తున్నారు.
యూరప్‌లో కూడా కార్మికులు డిమాండ్ల సాధన కోసం రోడ్లు, రహదారులను దిగ్బంధిస్తున్నారు. ప్రభుత్వాలు బడా వ్యాపారులు, కార్పొరేట్‌ సంస్థలపై ప్రేమ కురిపించడానికి బదులు మెజారిటీ వర్గంగా ఉన్న ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తే సత్ఫలితాలు లభిస్తాయి.
రైతులు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధిని వెతుక్కోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయితే యాంత్రీకరణ, ఆటోమేషన్‌, ఇప్పుడు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం కారణంగా వ్యవసాయేతర రంగంలో ఉపాధి లభించడం కష్టమైపోతోంది. అసంఘటిత రంగంలో కంటే సంఘటిత రంగంలో పని చేసే కార్మికుడు 19 రెట్లు అధికంగా ఉత్పత్తిని అందిస్తాడు.
ప్రభుత్వ సేకరణ ఎప్పుడు?
ధరలు ఎంఎస్‌పీ కంటే తక్కువగా ఉన్నప్పుడే ప్రభుత్వ సేకరణ అవసరం అవుతుంది. అధిక ఉత్పత్తి జరగకపోయినట్లయితే పంటల ధరలు ఎంఎస్‌పీ కంటే ఎక్కువగా ఉంటాయి. దేశంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు, ఆకలి కేకలు వినిపించినప్పుడు, ధరలు ఆకాశాన్ని తాకినప్పుడు ప్రభుత్వం పంట మొత్తాన్నీ కొనుగోలు చేస్తుంది. ఆహార ధరలు తక్కువగా ఉండాలని సర్కారు కోరుకుంటుంది. అప్పుడు కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించవచ్చు. ఫలితంగా వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. చౌకగా పనివారు లభించాలని కోరుకునే సంపన్నులు లాభాలు మూటకట్టుకుంటారు

Spread the love