నవతెలంగాణ – కమ్మర్ పల్లి
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు గురువారం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. హైదరాబాదులోని లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి మండల పార్టీ అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొలువు తీరానున్న ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి, ప్రజల మనలను పొందేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ తరలి వెళ్లిన వారిలో నాయకులు బుజ్జి మల్లయ్య, సుంకేట బుచ్చన్న, సుంకేట శ్రీనివాస్, ఉట్నూర్ ప్రదీప్, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.