నవతెలంగాణ బెంగుళూరు: చలో ఢిల్లీ నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న కర్నాటక రైతుల(Karnataka Farmers)ను మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్‌లో అదుపులోకి తీసుకున్న సంగతి విధితమే. తాజా, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘మా రైతులను విడిచిపెట్టండి` అని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కోరారు. ఎటువంటి కారణం లేకుండా తమ రైతులను అరెస్టు చేశారని మధ్యప్రదేశ్ సీఎంకు రాసిన ఓ లేఖలో సిద్ధరామయ్య తెలిపారు. రైతుల్ని అరెస్టు చేసి నాలుగు రోజులు అవుతోందన్నారు. ఇప్పటి వరకు వాళ్లను రిలీజ్ చేయకపోవడం దారుణమని అన్నారు. అరెస్టు చేసిన ఆ రైతుల్ని వారణాసికి తీసుకువెళ్తున్నారని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. శాంతియుత నిరసనలో పాల్గొనడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఉత్తమ విధానాలను కోరుకుంటున్న రైతుల్ని అరెస్టు చేయడం దురదృష్టకరమని సీఎం సిద్దూ ఆరోపించారు. ఈ అంశంలో వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవాలని, రైతుల్ని ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చవద్దు అని సీఎం యాదవ్‌ను సిద్దరామయ్య కోరారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ రైతు సంఘాలు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.