కేంద్రబడ్జెట్‌కు వ్యతిరేకంగా 18,19 తేదీల్లో వామపక్షాల నిరసన

Left protest on 18, 19 against central budgetనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఈనెల 18, 19 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాదినేని వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెవి చలపతిరావు, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ మురహరి, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్‌రాజా, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సురేందర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న శనివారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలకు కేటాయింపులు తగ్గించి సంపన్నులకు రాయితీలు పెంచిందనీ, సామాన్య ప్రజలకు తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. ఈ బడ్జెట్‌కు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను రూపొందించి, వాటిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ అఖిలభారత వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈనెల 18,19 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో 200 మంది శతకోటీశ్వరులపై నాలుగు శాతం సంపద పన్ను ప్రవేశపెట్టాలనీ, కార్పొరేట్‌ పన్ను పెంచాలనీ, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలనీ, బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐ ఉపసంహరించాలనీ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ, ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటువారికి అప్పగించడం ఆపాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50 శాతం నిధుల కేటాయింపులు పెంచాలనీ, పట్టణాలకు వర్తింపజేయాలనీ, ఆరోగ్య, విద్యారంగాలకు జీడీపీలో మూడు శాతం చొప్పున కేటాయించాలనీ, ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆహార సబ్సిడీని పెంచాలనీ, ఎస్సీ, ఎస్టీ రంగాలకు, మహిళ, శిశు సంక్షేమానికి కేటాయింపులు పెంచాలనీ, స్కీమ్‌ వర్కర్ల గౌరవ వేతనంలో కేంద్రవాటాను పెంచాలనీ, రాష్ట్రాలకు నిధుల బదిలీ పెంచాలని కోరారు. పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులు, సర్‌చార్జిలను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో పార్లమెంట్‌లో ఫైనాన్స్‌ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు.

Spread the love