రాష్ట్రంలో వామపక్ష పునరుజ్జీవనం

రాష్ట్రంలో వామపక్ష పునరుజ్జీవనం– లెఫ్ట్‌-కాంగ్రెస్‌ స్నేహం పని చేస్తున్నది
– బెంగాల్‌లో వాస్తవికతను హస్తం హైకమాండ్‌ అంచనా వేయాలి:సీపీఐ(ఎం) నాయకులు ఎం.డీ సలీం
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్‌ సెక్రెటరీ ఎం.డి సలీం రాష్ట్రంలో వామపక్ష పునరుజ్జీవనంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో స్నేహం బాగా పని చేస్తున్నదనీ, అట్టడుగు స్థాయిలో బంధం ఏర్పడిందని చెప్పారు. బెంగాల్‌లో మారుతున్న వాస్తవికతను కాంగ్రెస్‌ హైకమాండ్‌ అంచనా వేయాలని వివరించారు. గెలుపు ఇప్పటికే ఖరారైందనీ, మాల్దా, ముర్షిదాబాద్‌ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయన్నారు. వామపక్ష-కాంగ్రెస్‌ కలయిక దక్షిణ బెంగాల్‌ను స్వీప్‌ చేస్తుందని చెప్పారు.” బీజేపీకి జనంతో ఎలాంటి సంబంధం లేదు. తృణమూల్‌ భారీ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. అందుకే మమతా బెనర్జీ ఎదురీదుతున్నారు. ఒక రోజు ఇండియా బ్లాక్‌తో, మరుసటి రోజు బీజేపీతో.. ప్రతిరోజూ తన వైఖరిని మార్చుకుంటున్నారు. లెఫ్ట్‌-కాంగ్రెస్‌ పార్టీలకు ఓట్ల శాతం కచ్చితంగా పెరుగుతుంది. దీనితో బెంగాల్‌ ప్రజలే లబ్ధి పొందుతారని నేను భావిస్తున్నాను. బీజేపీ, టీఎంసీ.. రెండూ భారీ నష్టాన్ని చవిచూస్తాయి. బెంగాల్‌లో ఇండియా కూటమి లాభపడబోతున్నది. సందేశ్‌ఖలీ అనేది స్వతంత్ర సంఘటన కాదు. బీర్భూమ్‌, బంకురాతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఇటువంటి ఉదాహరణలను కనుగొనవచ్చు. టీఎంసీ సంస్థలను, విలువలను నాశనం చేసింది. ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడ్డాయి. మరికొన్ని సందర్భాల్లో మహిళలపై దాడులు, వేధింపులు లైంగికదాడులు జరిగాయి. మా పార్టీ మాజీ ఎమ్మెల్యే నిరపాడ సర్దార్‌ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు, ఇప్పుడు బీజేపీలో ఉన్న అప్పటి డిప్యూటీ స్పీకర్‌ సోనాలి గుహ మైక్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారు. టీఎంసీ పనితీరు ఇలాగే ఉన్నది. ఈ ఘటనతో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను ముడిపెట్టి మతపరమైన రంగును అద్దేందుకు బీజేపీ ప్రయత్నించింది. తమ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని, ప్రజల నిరసనను నిలదీయటం ద్వారా రాజకీయ మైలేజీని పొందేందుకు ప్రయత్నించారు” అని అన్నారు.
మమతా బెనర్జీ తనను తాను నవ్వుల పాల్జేసుకుంటున్నదని చెప్పారు. ”ఇండియా బ్లాక్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, హౌరా నుంచి ఢిల్లీకి అందరూ రైలు ఎక్కవచ్చని నేను విలేకరుల సమావేశంలో చెప్పాను. అయితే, సీబీఐ-ఈడీ నుంచి తన మేనల్లుడును కాపాడేందుకు మమత ‘రైలు’ నుంచి కిందకు దిగింది. ఆ సమయంలో మోడీ ‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌’ నినాదంతో బయటకు వచ్చారు. మమత ఇండియా కూటమిని ప్రమాదంలో పడేస్తే మంచిదని భావించారు. నితీష్‌ కుమార్‌లాగానే.. మమత కూడా గాలి ఎటువైపు వీస్తే అటు వెళ్తున్నారు. ఆమె అవకాశవాది” అని ఆయన చెప్పారు. ”ఆమె ఇప్పుడు కాంగ్రెస్‌లో విభేదాలు సృష్టించాలని అనుకుంటున్నారు. అందులోంచి పుట్టిందే టీఎంసీ. బెంగాల్‌లో అధికార పార్టీపై వ్యతిరేకత బీజేపీకి ఉపకరిస్తుంది. సహజంగానే, ఏఐసీసీ నాయకులు, ముఖ్యంగా ఖర్గే బెంగాల్‌ రాజకీయాల్లో కొత్తగా మారుతున్న వాస్తవికత, కథనాలు, ఉద్భవిస్తున్న దృశ్యాలను అంచనా వేయాలి. బెంగాల్‌ తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ వెళ్ళవలసిన అవసరం ఉన్నది” అని సలీం అన్నారు.

Spread the love