నేటి నుంచి పునఃప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు

నవతెలంగాణ హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమై తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అనంతరం సభలను 16వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నేడు సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాలుంటాయి. అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ‘తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య, క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు’, ‘తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు`లను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ‘తెలంగాణలో పర్యాటక విధానం’పై స్వల్పకాలిక చర్చను చేపడతారు.
శాసనమండలిలోనూ ఇదే అంశంపై చర్చ ఉంటుంది. శాసనసభను, మండలిని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది సోమవారం బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు. ఈ దఫా సుమారు వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే రైతు భరోసా విధి విధానాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఆర్‌ఓఆర్‌ 2024 కొత్త చట్టాన్ని కూడా తీసుకురానున్నట్టు సమాచారం.

ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన బిల్లులు, సమాధానాలు, ఇతర అంశాలను అసెంబ్లీ, మండలిలో సీఎం తరఫున ప్రవేశపెట్టడానికి, సమాధానమివ్వడానికి, నోట్‌ చేసుకోవడానికి కొందరు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. పురపాలక, పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, న్యాయశాఖలను శ్రీధర్‌బాబుకు, వాణిజ్యపన్నుల శాఖను జూపల్లి కృష్ణారావుకు, విద్యాశాఖను దామోదర్‌ రాజనర్సింహకు, హోం, జైళ్లు, అగ్నిమాపక సేవలు, కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలను పొన్నం ప్రభాకర్‌కు, మైనారిటీ సంక్షేమం, ఎస్సీ డెవలప్‌మెంట్, ఎస్టీ సంక్షేమ శాఖలను సీతక్కకు, దివ్యాంగ సంక్షేమం, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమం, క్రీడా, యువజన సేవల శాఖలను కొండా సురేఖకు అప్పగించారు.

Spread the love