
మార్కిస్ట్ మహోపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఐఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య కోరారు. సోమవారం మండల కేంద్రంలోని గునిగంటి సత్యనారాయణ విజ్ఞాన కేంద్రంలో కామ్రేడ్ లెనిన్ 154 వ జయంతి సీపీఐ (ఎంఎల్) 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరుణ పతాకాన్ని ఎగరవేసి, కామ్రేడ్ లెనిన్ కు ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఐ, సీపీఐ(ఎం) లు అనుసరించిన పార్లమెంటరీ విధానాల వెలుగులో కేరళ, పశ్చిమ బెంగాల్ మార్గమే మా మార్గం అంటూ నిర్దేశించడంతో తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాటాన్ని విరమింప చేయడం జరిగిందని, దీనితో మితవాద ధోరణలను వ్యతిరేకిస్తూ అంతర్గత సైద్ధాంతిక పోరాటాన్ని కొనసాగిస్తూ విప్లవకారులు వారితో విడిపోయి సీపీఐ (ఎంఎల్) గా ఆవిర్భవించడం జరిగిందన్నారు. అలా ఏర్పడిన సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాటి నుండి నేటి వరకు దేశంలోని పీడిత, తాడిత ప్రజల పక్షాన కార్మిక వర్గ నాయకత్వంలో బలమైన పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ మండల నాయకులు దగ్గుల మల్లయ్య, మందడి భూపాల్ రెడ్డి,నూకల అంజయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి ముప్పాని సుదర్శన్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, పివైఎల్ నాయకులు ఉప్పుల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.