బాలుడిపై చిరుత దాడి..టీటీడీ కీలక నిర్ణయం

నవతెలంగాణ – తిరుమల
తిరుమలలో ఐదేండ్ల చిన్నారిపై చిరుత దాడితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. అలిపిరి నడక మార్గంలో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. చిరుతను పట్టుకునేందుకు గాలిగోపురం నుంచి ఏడో మైలు వరకు 30 కెమెరా ట్రాన్స్‌లు ఏర్పాటు చేశారు. రెండు చోట్ల బోన్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని టీటీడీ యోచిస్తోంది. తిరుమలలో శుక్రవారం సాయంత్రం చిరుత దాడిలో గాయపడ్డ బాలుడు కౌశిక్‌ను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. అనంతరం చిరుత దాడి చేసి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసింది చిరుత పిల్ల కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్‌ స్టేషన్‌ నుంచి లైట్లు వేయడంతో చిరుత ఆ పిల్లాడిని వదిలేసి వెళ్లిందని పేర్కొన్నారు. చిరుత దాడి నేపథ్యంలో రాత్రి 7 గంటల తర్వాత గాలిగోపురం నుంచి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపించేలా ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీరితో పాటు సెక్యూరిటీ గార్డు ఉంటారని అన్నారు. చిన్న పిల్లలు బృందం మధ్యలో ఉండేలా చూసుకోవాలని.. అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి నడక మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు.

Spread the love