– ఆ తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలి
– నేడు పీహెచ్‌సీలు, రేపు కలెక్టరేట్ల ముందు ఆందోళనలు : తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి
– వైద్యారోగ్య శాఖ కమిషనరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆశాలకు లెప్రసీ సర్వే, పల్స్‌పోలియో పెండింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలనీ, ఆ తర్వాతనే వారితో కొత్త సర్వేలు చేయించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీల ఎదుట ధర్నాలు చేయాలనీ, బుధవారం కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేయాలని ఆశావర్కర్లకు పిలుపునిచ్చారు. పెండింగ్ డబ్బులను ఇచ్చేదాకా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని కోఠిలో గల వైద్యారోగ్య శాఖ కమిషనరేట్ ఎదుట ఆశావర్కర్లు ధర్నా నిర్వహించారు. తమకు పెండింగ్ పారితోషికాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆశాలు 2023, 2024లో లెప్రసీ సర్వే, 2024లో పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారనీ, వాటికి సంబంధించి ఇప్పటివరకూ డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. రాష్ట్ర కేంద్రంలోని అధికారులేమో సర్వేల డబ్బులు విడుదల చేశామని చెబుతున్నారనీ, ప్రోసీడింగ్ ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన డబ్బులు చెల్లించినట్టు కాదనీ, ఇంకా రాలేదని జిల్లా అధికారులు చెబుతున్నారని చెప్పారు. అంతిమంగా రాష్ట్ర, జిల్లా అధికారుల మధ్య ఆశాలు నలిగిపోతున్నారని వాపోయారు. పాత సర్వేలు, పల్స్‌పోలియో డబ్బులే ఇవ్వలేదుగానీ కొత్తగా మళ్లీ లెప్రసీ సర్వే చేయాలని ఆశాలపై ఒత్తిడి చేయడమేంటి? వారికి ట్రైనింగ్ ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు. ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్, తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.యాదమ్మ, రాష్ట్ర నాయకులు మీనా, హైదరాబాద్ సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి ఎం.అనిత, సంయుక్త కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి, సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు జె.కుమారస్వామి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.