తక్కువ ఖర్చు..ఎక్కువ ఆయకట్టు

Cm Revanth Reddy– ఆరు ప్రాజెక్టులపై సర్కారు ప్రత్యేక దృష్టి
– అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత
– వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంకల్పించారు. ఇప్పటికే ఖర్చుపెట్టి, గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులను వీలైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మేరకు అటు గోదావరి బేసిన్‌తో పాటు ఇటు కృష్ణా బేసిన్‌లో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలన్నీ ఇరిగేషన్‌ ఇంజినీర్ల నుంచి తెప్పించుకున్నారు.
ఇందులో భాగంగా గోదావరి బేసిన్‌లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందనీ, దాదాపు 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని ఇరిగేషన్‌ విభాగం అంచనాలు రూపొందించింది. తక్కువ నిధులతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా చేపట్టాలనీ, వచ్చే ఏడాది మార్చి నాటికి వందకు వంద శాతం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు వీలుగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలనీ, సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నీలంవాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ద్వారా నిర్మల్‌ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్‌ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజీ 2తో వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్‌ ప్రాజెక్టుతో నిర్మల్‌ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది.
రైతులకు సాగునీటిని అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పదేండ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్‌ హౌజులకే పరిమితమయ్యాయి. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించటం తప్ప మెయిన్‌ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే వదిలేసింది. అదే తరహాలో గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇటీవల పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత తొందరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరగుతుందనీ, అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
నేడు ఏపీకి సీఎం రేవంత్‌
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డితో కలిసి సీఎం హాజరు కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం మంగళగిరి చేరుకుని సాయంత్రం 5 నుంచి 6:30 గంటల వరకు వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. రాత్రి 7గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ రానున్నారు.

Spread the love