– అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రశంసలు
– కేటీఆర్‌తో అనుభవాలు పంచుకున్న ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డును అందించిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ మరియా సి లెమన్ ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. ఆ సంస్థ ప్రతినిధులు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంపై ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని నేవెడా రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైన ప్రపంచ ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్స్ కాంగ్రెస్ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన తర్వాత అమెరికన్ సివిల్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ సీనియర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. అమెరికన్ సొసైటీ అఫ్ సివిల్ ఇంజనీర్స్ తదుపరి ప్రెసిడెంట్ షిరిల్ క్లార్క్ కాళేశ్వరం ప్రాజెక్టు అత్యద్భుతమని పొగిడారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లోని గొప్ప మార్పు వచ్చిందని అన్నారు. ఒక హైడ్రాలిక్ ఇంజనీర్‌గా వాటర్‌ను 500 మీటర్ల సముద్రమట్టానికిపైగా తీసుకురావడం ఊహకు అందని గొప్ప ఆలోచన అని అన్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ డైరెక్టర్ బ్రయాన్ పర్సన్స్ కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాగునీటిని సంతప్త స్థాయికి ఉపయోగించుకోవడమనేది ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాలు అని, తెలంగాణ ఈ దిశగా ఇతర దేశాలకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిందని అన్నారు.