నేనే చెబుతా..

I will tell you..– కేసీఆర్‌ వ్యాఖ్యలపై దర్యాప్తు అధికారుల దృష్టి
– ఫోన్‌ట్యాపింగ్‌లో రెండోరోజూ రాధాకిషన్‌రావు విచారణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలపై స్పెషల్‌ టీం దర్యాప్తు అధికారులు దృష్టిని సారించారు. విపక్షాలకు చెందిన ప్రముఖులతో పాటు పలువురు వ్యాపారులు, ఇతర ప్రముఖుల ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు అదనపు ఎస్పీలు, ఒక మాజీ డీసీపీ, ఒక డీఎస్పీ అరెస్టయిన విషయం తెలిసిందే. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఎస్‌ఐబీ ఓఎస్డీగా పని చేసినమాజీ ఐజీ ప్రభాకర్‌రావు నేతృత్వంలోనే ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సాగిందనీ, ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు దర్యాప్తులో వెల్లడించినట్టు కేసును పర్యవేక్షిస్తున్న అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే, ప్రభాకర్‌రావు చెప్పిన మేరకు అప్పటి ప్రతిపక్షానికి చెందిన ప్రముఖులలో రేవంత్‌రెడ్డి మొదలుకొని పలువురు కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసినట్టుగా కూడా ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో అధికారులు తేల్చారు. అయితే, విపక్షాలకు చెందిన ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్‌ చేయాలని అప్పటి పొలిటికల్‌ బాస్‌లలో ఎవరు వీరికి ఆదేశాలిచ్చారనే విషయమై దర్యాప్తు అధికారులు ఆచితూచి విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా, ఈ కేసులో ఒకటో నిందితుడిగా పేర్కొనబడిన మాజీ ఐజీ ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండటంతో.. ఆయనను విచారించాకే ఈ కేసు వెనక ఉన్న అప్పటి బీఆర్‌ఎస్‌ పొలిటికల్‌ బాస్‌ల గుట్టును రట్టు చేయాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌ పర్యటనలో ఉండగా ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంపై విలేకరులు కేసీఆర్‌ దృష్టికి తీసుకురాగా.. వచ్చే రెండు, మూడ్రోజుల్లో తాను ఈ అంశంపై మాట్లాడతాననీ, ఈ వ్యవహారం వెనక ఉన్న నిజాలను బయటపెడతాననీ, కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసు వెలుగు చూసిననాటి నుంచి ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న కేసీఆర్‌.. తాజాగా తాను పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాననీ, ఈ వ్యవహారంపై తప్పక స్పందిస్తానని ఈ రోజు మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా, కేసు దర్యాప్తును సాగిస్తున్న అధికారులు ఈ వ్యాఖ్యలపై నిశితంగా దృష్టిని సారించినట్టు తెలిసింది.
ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం వెనక కేసీఆర్‌ కుటుంబం ఉందంటూ తాజాగా మంత్రి సీతక్కతో పాటు గతంలో, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మరో సీనియర్‌ నాయకుడు రఘునందన్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కూడా ఆరోపణలు చేశారు. ఈ కేసులో కేసీఆర్‌ తానే స్వయంగా నిజాలు బయటపెడతానని తెలపటంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆ దిశగా దృష్టిని సారించారు. ఆయన ఏం మాట్లాడతాడోనని మాకు కూడా ఆసక్తిగా ఉన్నదని ఒక సీనియర్‌ పోలీసు అధికారి అన్నారు.శుక్రవారం రెండో రోజు కూడా తమ కస్టడీలో ఉన్న రాధాకిషన్‌రావును దర్యాప్తు అధికారులు విచారించారు. ముఖ్యంగా, ఫోన్‌ట్యాపింగ్‌ ద్వారా ఏయే విపక్ష నాయకుల నుంచి గత అసెంబ్లీ, ఉప ఎన్నికల సమయంలో డబ్బులను సీజ్‌ చేశారు? వాటిని తర్వాత ఎక్కడికి చేర్చారు? ఎవరికి అందించారు? అనే కోణంలోనే ఎక్కువగా దర్యాప్తు అధికారులు రాధాకిషన్‌రావుపై ప్రశ్నలు కురిపించినట్టు తెలిసింది. అలాగే, ఈ కేసులో నల్గొండకు చెందిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా అధికారులు పిలిచి ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

Spread the love