సీపీఐ(ఎం) అభ్యర్ధులను గెలిపించండి

hadi mani fest -6- final– బీజేపీ అభ్యర్ధులను ఓడించండి
– వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక, సామాజిక పోరాట శక్తులను బలపర్చండి
– భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల మ్యానిఫెస్టో-2023
రాష్ట్ర శాసనసభకు 2023 నవంబరు 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ మ్యానిఫెస్టో ప్రకటిస్తున్నది. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కీలక అంశాలను పరిష్కరించకుండా పాలకులు దాటవేస్తున్నారు. సీపీఐ(ఎం) నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా ఉంది. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నది. అలాంటి సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించి శాసనసభకు పంపించడం అవసరం.  గత ఐదేండ్లుగా వామపక్షాలు లేని శాసనసభను తెలంగాణ ప్రజలు గమనించారు. ప్రజాసమస్యల గురించి వామపక్షాలు మాత్రమే శాసనసభలో నినదిస్తాయని రుజువైంది. వామపక్షాలు లేని లోటు శాసనసభలో స్పష్టంగా కన్పించింది. ఈ ఎన్నికల సందర్భంగా సీపీఐ(ఎం), వామపక్షాల అభ్యర్ధులను గెలిపించడం ద్వారా తెలంగాణ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం.
శాసనసభ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో ఎన్నో వాగ్ధానాలు చేస్తున్నారు. కానీ అమలుచేయడం లేదు. బీజేపీ ఈ ఎన్నికలలో పాల్గొంటున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలలోగానీ, కేంద్రంలోగానీ ప్రజావ్యతిరేక విధానాలు అమలుచేస్తున్నది. వీటి నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకు విచ్ఛిన్నకర ఎత్తుగడలు కొనసాగిస్తున్నది. మత రాజకీయాలను ప్రోత్సహించి, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే కుల, మత తగాదాలను రెచ్చగొడుతున్నది. దేశంలో అమలవుతున్న సరళీకృత ఆర్థిక విధానాలు, అవినీతి, నియంతృత్వ ధోరణులు, మతతత్వ చర్యలతో దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ, దాని మిత్రులను తిరస్కరించాలి. లౌకిక, ప్రజాస్వాయ్య, సామాజిక పోరాట శుక్తులను బలపర్చండి. సీపీఐ(ఎం) అభ్యర్ధులను గెలిపించాలి.
ప్రజాసమస్యలు
– ఇండ్లు లేని వారందరికీ ఇండ్లస్థలాలు, ఇండ్ల నిర్మాణానికి రు.10లక్షలు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం.
– ప్రభుత్వ భూములను ఆర్హులైన పేదలందరికీ పంపిణీ చేయాలని పోరాడుతాం.
– ప్రభుత్వ, అటవీ బంజరు భూములలో నివాసం ఉంటున్న, సాగుచేస్తున్న పేదలకు పట్టాల కోసం పోరాటం చేస్తాం.
– కుల, మత ఘర్షణలను నివారించి, నేరాలకు బాధ్యులైనవారిని శిక్షించి, బాధితులకు రక్షణకు కట్టుబడి ఉంటాం.
ఉపాధి హామీ
– ఉపాధి హామీ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని, సంవత్సరం పొడవునా అర్హులైన వారందరికీ పని కల్పించాలని, పట్టణ ప్రాంతాలకు కూడా ఈ చట్టాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వంపై పోరాడుతాం.
– కేంద్రం కేటాయించే నిధులతో పాటు తగినన్ని నిధులు రాష్ట్ర బడ్జెట్‌ నుండి కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం.
– కొలతల పద్ధతి నివారించి రోజు కూలీ విధానం అమలుకు కృషిచేస్తాం.

నిర్వాసితులు
భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013చట్ట ప్రకారం (ప్రభుత్వ, అసైన్డ్‌ భూములకు కూడా) పరిహారం ఇవ్వాలి.
పట్టాలు లేకున్నా సాగుదారు లందరికీ పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తాం.

పారిశ్రామిక రంగం

– కనీస వేతనం రూ. 26,000/-లకు తగ్గకుండా నిర్ణయించే వరకూ, కార్మిక చట్టాల అమలుకు పోరాడతాం.
– సమాన పనికి సమాన వేతనం  మా డిమాండ్
– కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తాం.
– ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేస్తాం.
– చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతాం.
– మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు కృషి చేస్తాం.
– వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటుకు ప్రయత్నం చేస్తాం.
– రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీ పేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
– ఐటిఐఆర్‌ ప్రాజెక్టును రప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయడానికి కృషి చేస్తాం
– సింగరేణిని ప్రభుత్వరంగంలోనే బలోపేతం చేసేందుకు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు వత్తిడి చేస్తాం.
– విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను త్వరితంగా ఏర్పాటు చేసి, స్వయం పోషకత్వం సాధించేందుకు చర్యలు తీసుకోవాలనీ,    వివిధ జిల్లాల్లో లభిస్తున్న ఖనిజాల ఆధారంగా పరిశ్రమలను నెలకొల్పి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. వికేంద్రీకరణ ద్వారా అన్ని జిల్లాల్లో ఉపాధి పెంచి సమతుల్యతకు కట్టుబడి ఉన్నాం.
– కాలుష్యరహిత పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. పర్యావరణ రక్షణకు ప్రాధాన్యతనిచ్చి కఠినమైన  చట్టాలను అమలు చేయాలి..
– పారిశుధ్య సేవలకు సంబంధించి రాంకీ, తదితర ప్రయివేటు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి.
– పారిశుధ్య కార్మికుల పిల్లలకు ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్స్‌ అందించేందుకు కృషిచేస్తాం.

వ్యవసాయరంగం
– రైతుల పెట్టుబడికి సరిపడా రుణాన్ని బ్యాంకులు, సహకార సంస్థల నుండి సమకూర్చేందుకు కృషి చేస్తాం. మార్కెట్‌ కమిటీల ద్వారా రైతులకు ఉపకరణాలు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం.
– రైతుల పంటలపై 80శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని కోరతాం.
– ప్రభుత్వమే భూసార పరీక్షలు నిర్వహించి ఎరువులు, పురుగు మందుల వాడకంపై రైతులకు తగు సూచనలు చేమాలి.
– ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని,పంటలు సేకరించాలని కోరతాం.
– విత్తన చట్టాన్ని తక్షణమే ఆమోదించి అమలు చేసేందుకు, విత్తన పరిశోధనా కేంద్రాల కోసం కృషి చేస్తాం.
– ప్రత్యామ్నాయ పంటలుగా తృణధాన్యాలకు ప్రోత్సాహం
– వ్యవసాయ అనుబంధ రంగాలైన పాలు, కూరగాయాలు, పశుసంవర్థక శాఖ, హార్టికల్చర్ శాఖల నుండి సలహాలు, ఆర్థిక వనరులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పశుసంవర్థకశాఖ, హార్టికల్చర్ శాఖల నుండి సలహాలు, ఆర్థిక వనరలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.
– కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని, ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తాం.
– కౌలురైతులకు గుర్తింపు, వ్యవసాయ రుణాలు, సబ్సిడీలు, పంటబీమా, కౌలు, పోడు మొదలగు రైతులందరికీ రూ.5లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం.
– 10 ఎకరాల లోపు రైతులకు వ్యవసాయ ఉపకరణాలు (విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు) ఉచితంగా ప్రభుత్వం అందించాలి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేసి, నాణ్యమైన విత్తనాలను అందించాలి.

దళితుల ఆత్మగౌరవం-అభివృద్ధి కొరకు హామీ
– ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి.
–  ఎస్సీ, ఎస్టీ బడ్జెట్లలో, సబ్‌ప్లాన్‌ చట్టాలలో లోపాలను సవరించి, రూల్స్‌ రూపొందించి ఖచ్చితంగా సబ్‌ప్లాన్‌ నిధులను ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ఖర్చుచేసేందుకు ప్రభుత్వంపై పోరాడతాం.
– దళిత, గిరిజన,నిమ్నకులాల ప్రజల అత్యధికంగా ఉన్న వ్యవసాయ కార్మిక రంగంలో సమగ్ర సామాజిక భద్రతా చట్టం తీసుకురావాలి. ఉపాధి హామీ కార్మికులకు హెల్త్ కార్డులు, పెన్షన్లు ఇచ్చేందుకు కృషిచేస్తాం.
– ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణకు కృషి చేస్తాం. బ్యాక్‌లాగ్‌ పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు, బ్యాంకులతో లింక్ లేకుండా కార్పొరేషన్‌ రుణాలు ఇచ్చేందుకు ఒత్తిడి తెస్తాం.
– జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులను, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పకడ్బందీగా అమలు చేయాలి.
– స్మశాన వాటికలు లేని గ్రామాలలో స్మశానవాటికలు ఏర్పాటుకు కృషి చేస్తాం.
– దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి.
– కాటికాపరుల వృత్తిపై జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య రక్షణకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ మంజేరు చేయాలి.
– స్మశానవాటికలలో తోటమాలి పని ప్రయివేటీకరణను రద్దుచేసి కాటికాపరులకు అప్పగించాలి.
– కాటికాపరుల పిల్లలకు ఉచిత విద్య, హాస్టల్ వసతి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం.
– భూమి లేని నిరుపేద బ్యాగరీ కుటుంబాలకు సాగుభూమి కేటాయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
వ్యవసాయ కార్మికులు
– వ్యవసాయ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రీమియం ప్రభుత్వమే చెల్లించడానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.
– వినియోగ రుణాలు (కన్స్యూమర్‌ లోన్స్‌) బ్యాంకుల నుండి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం.
– వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం అమలుకు కట్టుబడి వున్నాం.
– భూమి లేని వ్యవసాయ కూలీలకు మిగులు భూమి పంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
అందరికీ విద్య
– రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 20శాతం నిధులను, కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులను విద్యకు కేటాయించేందకు ఆందోళన కొనసాగిస్తాం. ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి.
– టిఫిన్, భోజనం, పుస్తకాలు, దుస్తులు మరియు అన్నిరకాల ఆటవస్తువులు పాఠశాలకు కల్పించాలి. విద్యార్ళులకు విద్యాహక్కు చట్టం అమలు చేసేందుకు కృషి చేస్తాం.
– అందరికీ ఉచిత శాస్త్రీయ విద్యను ప్రవేశపెట్టేందుకు, 3-18 సం.ల వయసు గల విద్యార్థులకు విద్యాహక్కుచట్టం అమలు చేసేందుకు కృషి చేస్తాం.
– కామన్ స్యూల్ విధానాన్ని అమలు చేసేందుకు పోరాడతాం.
– ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించాలి. కొత్తగా కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుమతులు ఇవ్వరాదు. – రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తాం.

వైద్యం
– పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తాం. వైద్య రంగానికి తగినన్ని నిధులు బడ్జెట్‌లో కేటాయించేందుకు ఆందోళన కొనసాగిస్తాం.
– కార్పొరేట్‌ వైద్యాన్ని నియంత్రించి, ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ను రూ. 15 లక్షలకు పెంచి, సమర్ధవంతంగా అమలుచేసేందుకు ఒత్తిడి చేస్తాం.

ప్రజా పంపిణీ వ్యవస్థ
– ప్రభుత్వ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పోరాడతాం.
– సన్నబియ్యం, గోధుమలు, పప్పులు, నూనెల వంటి నిత్యావసర సరుకులను చౌక డిపోల ద్వారా పంపిణీ చేసేందుకు పోరాడుతాం.
అధికార వికేంద్రీకరణ
– స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. కేరళ మాదిరిగా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి.
– 73, 74 రాజ్యాంగ సవరణలకు అనుగుణంగా నిధులు, అధికారాలు బదిలీ చేయాలి.
– గ్రామీణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తాం.
సామాజిక అంశాలు
– కులవివక్షకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చాలి. కుల దురహంకార హత్యలకు, దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలి. ఇందుకోసం ప్రజాస్వామ్య శక్తులను సమీకరిస్తాం.
కార్మిక సంక్షేమం- ఉద్యోగ భద్రత
– అంగన్వాడీ, ఆషా, మధ్యాహ్న భోజనం, ఐకెపి తదితర స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించేందుకు జరిగే పోరాటాలకు అండగా ఉంటాం. గ్రామ పంచాయితీ, మున్సిపల్‌ కార్మికుల వేతనాలకు ప్రభుత్వం నుండి గ్రాంటు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. పిఎఫ్, ఇఎస్ఐ,గ్ర్యాట్యుటీ, పెన్షన్ సౌకర్యాల కల్పన, 7 లక్షల
మంది బీడీ కార్మికుల ఉపాధి, వేతనాల పెంపు కోసం కృషి చేస్తాం.
– కార్మిక కేంద్రాలలో ఇఎస్ఐ హాస్పిటల్స్ ఏర్పాటు, ఇఎస్ఐ సేవలను సమర్ధవంతంగా అమలు జరిపేందుకు కృషి చేస్తాం.
– కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మినెంట్‌కు ఆటంకంగా వున్న యాక్ట్‌ 2/94 రద్దుకై పోరాడతాం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, డైలీవేజ్‌, ఎన్‌.ఎం.ఆర్‌ తదితర ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ కోసం జరిగే ఆందోళనలకు మద్దతునిస్తాం.
– అన్ని రకాల హమాలీలకు, మోటార్‌ ట్రాన్స్‌పోర్టు, ఆటో, ఇతర అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2వ పిఆర్‌సిని అమలు, డిఏ సకాలంలో విడుదల, హెల్త్‌ స్కీమ్‌ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను అమలు మా ప్రాధాన్యత.
– యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ అధ్యాపకులు రెగ్యులరైజేషన్‌ కోసం ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి సమస్యలను ప్రజాయుతంగా పరిష్కరించేందుకు వత్తిడి చేస్తాం
– నిస్తేజంగా పడివున్న కార్మికశాఖను పునర్వవస్థీకరించాలి. కార్మికుల ప్రయోజనాలకు హాని కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. కనీస వేతనాల సలహామండలి, లేజర్ వెల్ఫేర్ బోర్డు తదితర త్రైపాక్షిక కమిటీలను క్రియాశీలకంగా పనిచేయించే విధంగా ఒత్తిడి చేస్తాం.
సింగరేణి కార్మికుల సంక్షేమం
– వారసత్వ ఉద్యోగాలు కొనసాగింపు, కోలిండియాలో అమలవుతున్న ఒప్పందాలు (పర్మినెంటు, కాంట్రాక్టు కార్మికులు, అధికారులకు) వర్తింపుకు కృషి చేస్తాం. కార్మికులకు ఇండ్ల స్ధలాలు కేటాయింపుకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం.
– కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ కు కృషి చేస్తాం.
– కోలిండియా వేతనాల అమలు కోసం, లాభాల్లో వాటా చెల్లింపు కొనసాగింపుకు కృషి చేస్తాం.
– కోల్‌ బ్లాకులను ప్రైవేటుపరం కాకుండా కాపాడతాం
– గుర్తింపు ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికులకు ఓటుహక్కు కల్పించేందుకు యాజమాన్యంపై ఒత్తిడి చేస్తాం.
కులాంతర, మతాంతర వివాహాలు
-కులాంతర, మతాంతర వివాహాలను రు.10లక్షల ప్రోత్సహం, ఒకరికి ఉద్యోగం కల్పించి, ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వంపై పోరాడతాం. కులాంతర, మతాంతర వివాహాల రక్షణ చట్టం తేవడానికి కృషి చేస్తాం.
గిరిజనులు
– ఆదివాసీలకు 1/70 చట్టం, పెసా చట్టం అమలు, ఏజెన్సీ ఏరియాను 6వ షెడ్యూల్‌కు మార్చి స్వయంప్రతిపత్తి పాలకమండలి ఏర్పాటుకు కృషి చేస్తాము. గిరిజన చట్టాలను, అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తాం.
– ప్రతి జిల్లాకు ఐటిడిఎ ఏర్పాటు చేయాలి. తండాలలో ఏర్పడిన పంచాయితీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలి.
– గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇచ్చి, రుణసౌకర్యం కల్పించేందుకు పోరాడతాం.
– జీవో ఎంఎస్‌ నెం.3 పునరుద్ధరణకై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం.
-నాన్‌ ఏజెన్సీలో ఉన్న గిరిజన గ్రామాలను ఏజెన్సీలో కలపటం, ఉట్నూర్‌, భద్రాచలం 5వ షెడ్యూల్‌ ప్రాంతాలను కలుపుతూ ఏజెన్సీ జిల్లా ఏర్పాటుకు జరిగే ఆందోళనకు అండగా ఉంటాం.
– గొత్తి కోయలను ఎస్టీలుగా గుర్తించాలి. వారి గ్రామాలను తొలగింపును వ్యతిరేకిస్తాం.
గిరిజన విశ్వవిద్యాలయంలో గిరిజన విద్యార్ధులకు 80శాతం రిజర్వేషన్‌ కల్పిస్తాం
– లంబాడీ, గోండి, కోయ భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చి లిపిని తయారుచేయిస్తాం
వెనుకబడిన తరగతులు
– బిసి కులాలకు జనగణనను చేపట్టాలి. బిసిల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలి.
– వృత్తిదారులకు ప్రమాదబీమా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాం
– అర్హులైన వారందరికీ ఇంటి స్థలం, ఆ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణానికి ఆర్ధిక సహాయం కోసం పోరాడతాం.
మహిళా సాధికారిత
– మహిళా భద్రతా చర్యలు, అభివృద్ధికి ప్రత్యేక పథకాలు – వరకట్న నిషేధం, ఆస్తి హక్కు చట్టాలను గట్టిగా అమలు చేసేందుకు ఒత్తిడి చేస్తాము.
– లైంగికదాడులను నిరోధించేందుకు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు తగు చర్యలు చేపట్టాలని పోరాడతాం
– ఒంటరి మహిళలకు రూ.5వేలు పెన్షన్‌ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తాం
– మద్యాన్ని నియంత్రిస్తూ, బెల్టుషాపులను పూర్తిగా ఎత్తివేయాలి.
– పొదుపు సంఘాలకు బాకీపడ్డ వడ్డీ డబ్బు చెల్లించాలి. వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలి. అభయహస్తం, జనశ్రీ బీమా యోజన పథకాలను పునరుద్ధరించాలి.
మైౖనార్టీలు
– బ్యాంకు లింకు లేకుండా మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యక్ష రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తాం.
– మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన సబ్‌ప్లాన్‌ రూపొందించాలి.
– వక్ఫ్‌బోర్డుకు క్వాసీ జుడిషియల్‌ అధికారాలిచ్చి వక్ఫ్‌ ఆస్తులను కాపాడాలి. సచార్‌, సుధీర్‌, రంగనాథన్‌ కమిటీల సిఫార్సులను అమలుజేయాలి. ఉర్దూను రెండవ భాషగా గుర్తించి అభివృద్ధి చేయాలి.
– సంచార ముస్లిం జాతులైన ఫకీరు, గారడీ, ఎలుగుబంట్ల, బుగ్గేవాలా, అత్తరుసాహెబ్‌, దండేవాలా, బోరేవాలా, తురక కాశలకు ఓటరు గుర్తింపు కార్డులు, ఇండ్లు, సంక్షేమపథకాలు అమలు చేసేలా ప్రభుత్వంపై పోరాడతాం.
గీత కార్మికులు
– గీతకార్మికుల చెట్ల పెంపకానికి ప్రతి గ్రామానికి 5 ఎకరాలు భూమి  కేటాయింపుకు, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పి, వృత్తిని ఆధునీకరించేందుకు ప్రభుత్వంపై పోరాటవ చేస్తాం.
– ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత వికలాంగులకు రూ.10లక్షలు, తాత్కాలిక వికలాంగులకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు కృషి చేస్తాం. వారి పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఒత్తిడి చేస్తాం.
మత్య్స కార్మికులు
– విత్తన చేపల ఉచిత పంపిణీ, పడవలు, వలలు తదితర పనిముట్లు సబ్సీడీపై సరఫరా చేసేందుకు ఒత్తిడి చేస్తాం.
– చేపల వృత్తికి పడవలు, వలలు తదితర పనిముట్లు సబ్సిడీపై సరఫరా చేస్తాం
– మత్య్స సంపదకు మద్ధతు ధర ప్రకటించాలి.  కోల్డ్‌ స్టోరేజిల సౌకర్యం ప్రతి మండల/ జిల్లా కేంద్రాలలో హోల్ సేల్/ రిటేల్ మార్కెట్ల నిర్మాణం చేపట్టాలి.
– మత్య్సకార యువత/ మహిళలకు మొబైల్ ఫిష్ మార్కెట్లు, ఫిష్ ఫుడ్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తాం.
విశ్వకర్మ వృత్తిదారులు
– విశ్వకర్మ వృత్తిదారులకు ప్రత్యేక నిధులు కేటాయించి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి.
– విశ్వకర్మ వృత్తిదారులకు ముడిసరుకు సబ్సిడీతో అందించాలి. వారి ఉత్పత్తులకు మార్కెట్‌ వసతి, గిట్టుబాటు ధర కల్పించాలి.
గొర్రెల కాపరులు
– ప్రతి గ్రామంలో 10 ఎకరాలు గొర్రెల మేతకు కేటాయించాలి. తుమ్మచెట్లు, చెరువుపడకలపై ఉచితంగా హక్కులు కల్పించాలి. సాగుకు యోగ్యం కాని భూములన్నింటినీ గొర్రెల మేతకు కేటాంచాలి. మొబైల్ మెడికల్ వ్యాన్లు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. గొర్రెలు, మేకలకు, కాపరులకు బీమా సౌకర్యం కల్పించి, నష్టపరిహారం చెల్లించేందుకు ఒత్తిడి చేస్తాం. మాంసం ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ఎగుమతికి అవకాశం కల్పించాలి.
రజక, క్షౌర
– జి.ఓ.నెం.27 ప్రకారం ఆస్పత్రులు, పోలీస్‌ శాఖ, తదితర సంస్థల్లో ఖాళీ దోబీ, బార్బర్‌ పోస్టులు భర్తీ చేయాలి.
– డ్రైక్లీనర్లు, ఆధునిక దోభీ ఘాట్ల నిర్మాణం చేపట్టి, అపార్టుమెంట్లలో వృత్తి సౌకర్యం సబ్సిడీపై పనిముట్లు అందించే విధంగా ఒత్తిడి చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో లాండ్రీల ఏర్పాటుకు తగిన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలి.
– వాయిద్య పాఠశాలలు ఏర్పాటుకు , వాయిద్య పరికరాలను సబ్సిడీపై కొనుగోలుకు రుణ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాం. వృతి పెన్షన్ వర్తింపజేయాలని,సహకార సంఘాలు ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తాం.
– కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చి, వారి సంక్షేమానికి చర్యలు చేపట్టడానికి కృషి చేస్తాం.

వికలాంగులు

– వికలాంగుల పింఛన్ రు. 10వేలకు పెంపుదల కోసం, వికలాంగుల కోటా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కృషి చేస్తాం.

– 90శాతం సబ్సిడీతో రు. 5లక్షల రుణాలను అందించాలి. వికలాంగుల చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. పెన్షనర్లకు ఆదాయ పరిమితి విధించే జీఓ 17ను రద్దు చేసి, 40శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు పెన్షన్లు ఇప్పించేందుకు కృషి చేస్తాం.

– వైకల్య ధృవీకరణ పత్రం ఉన్నవారికి ఆర్టీసి మరియు రైల్వేలో ఉచిత ప్రయాణం కల్పించాలని వత్తిడి చేస్తాం నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కోసం రు. 5లక్షలు ఆర్థిక సహాయం అందించాలి ప్రతి మండలానికి స్వయం ఉపాధి యూనిట్ల సంఖ్యను పెంచాలి.

–  వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 సెక్షన్ 79 ప్రకారం వికలాంగుల కమిషన్ ఏర్పాటుకు కృషి చేస్తాం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలలో 5శాతం వికలాంగులకు కేటాయించాలి.

ట్రాన్స్‌జెండర్లు
– ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు, వసతి సౌకర్యాలు కల్పించేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయటం కోసం ఒత్తిడి చేస్తాం. గౌరవప్రదమైన జీవితం గడిపే విధంగా ప్రోత్సహించి అండగా ఉంటాం. అన్ని రకాల వృత్తుల్లో వీరికి అవకాశం కల్పించాలని ఒత్తిడి చేస్తాం.
విద్యుత్తు
– 250 యూనిట్లలోపు కరెంటు వాడకం ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం మీద వత్తిడి చేస్తాం
– విద్యుత్తు రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం. ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలి.
ఆర్‌టీసీ
ప్రజా రవాణాను మెరుగుపరచాలి.

– ప్రయివేటు బస్సుల అక్రమ రవాణాను అరికట్టాలి.

– అద్దె బస్సులు రద్దు చేయాలి. గ్యారేజీలు, ఇతర విభాగాల్లో ఔట్సోర్సింగ్ను నిషేధించి శాశ్వత సిబ్బందితోనే నడపాలి.

– కారుణ్య నియామకాల అమలును చేపట్టాలి

– ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం వల్ల తలెత్తే సమస్యలు, గతంనుండీ ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అండగా ఉంటాము.

నిరుద్యోగులకు భృతి

– నిరుద్యోగభృతికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి రూ.5,000/-లు నిరుద్యోగ భృతి కల్పించాలి

– పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు స్టడీసర్కిల్స్ నిర్వహించాలి. టీచింగ్ స్టాఫ్, హాస్టల్ వసతిని కల్పించాలి.

పౌర హక్కుల రక్షణ

– పౌర, ప్రజాస్వామిక హక్కులకు రక్షణ కల్పించాలి. అక్రమ కేసులను ఎత్తివేయాలి.

– కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేయాలి. జడ్జీల సంఖ్య పెంచాలి.

– మానవ హక్కుల కమిషన్ బ్రాంచిలు జిల్లాల్లో ఏర్పాటు చేయాలి.
– కన్సూమర్ కోర్టులకు జడ్జీల నియామకం చేపట్టాలి.

-లోకాయుక్త కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.

– మీడియాపై గుత్తాధిపత్య నిరోధానికి కట్టుబడి ఉంటాం.

– సమాచార హక్కు చట్టాన్ని సమర్ధవంతంగా అమలుచేయాలి.

-ప్రజలకు నిరసన తెలిపే హక్కును, పోరాడే హక్కును, పౌరహక్కులను కాపాడాలి. పై హక్కుల కోసం ప్రజలను సమీకరిస్తాము.

లౌకిక విలువలు
– మతం వ్యక్తిగత విశ్వాసం, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడాన్ని నిరోధించాలి. మత సామరస్యాన్ని  పెంపొందించాలి.
– తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన విభజన సృష్టించేందుకు మతోన్మాద శక్తులు చేస్తున్న ప్రయత్నాలను నిలువరిస్తాము. లౌకికి ప్రజాస్వామ్య శక్తులను సమీకరించి పోరాడుతాం.
– తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని, చరిత్రను వక్రీకరించేందుకు మతోన్మాదులు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, ఎదుర్కొంటాం.
జర్నలిస్టులు

-పాత్రికేయులకు రక్షణ కల్పించి, సంక్షేమ పథకాల అమలకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– ప్రతి జర్నలిస్టుకు 300 గజాల ఇంటిస్థలం ఉచితంగా కేటాయింపు, ఇంటి నిర్మాణానికి రు.10లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలి.
– పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు రు. 10వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
– పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య అందించాలి.
– జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు హెల్త్ స్కీం అమలు చేసేందుకు వత్తిడి చేస్తాం. పై సమస్యల పరిష్కారానికి జర్నలిస్టుల పోరాటాలకు అండగా ఉంటాం.

అవినీతి నిర్మూలన
రాజకీయాల్లో, సమాజంలో అవితిని, అవకాశవాదాన్ని అంతమొందించేందుకు విలువలను ప్రోత్సహించి, ప్రజాచైతన్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపడతాం.

పర్యావరణం

– పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తాము. కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పరిశ్రమల స్థాపనను అడ్డుకుంటాము. ప్రస్తుతం పర్యావరణకు హాని కలిగిస్తున్న పరిశ్రమలను మూసివేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. మూసీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వంమీద వత్తిడి చేస్తాం.

క్రీడలు
– గ్రామ, మండల, జిల్లా రాష్ట్ర స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం కల్పించాలి. ప్రత్యేక నిధులు కేటాయించి జాతీయ స్థాయి సామర్థ్యాన్ని పెంచే విధంగా క్రీడల విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసేందకు వత్తిడి చేస్తాం. అన్ని రకాల క్రీడలకు వనరులు కల్పించడంతో పాటు, ట్రైనింగ్ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం మీద వత్తిడి చేస్తాం.
ఐటి రంగం
-శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తున్నాయి (కృత్రిమ మేథ, విద్య, వైద్యం తదితర అంశాలలో). వాటి ఫలితాలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధానాన్ని అవలంభించాలి. -మాతృభాషలో టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడం, ఫ్రీసాఫ్ట్వేర్ ప్రత్యామ్నాయాన్ని వినియోగించడం విధానంగా అమలు చేయాలి.

 

Spread the love