పంటలు ఎండనివ్వం.. ప్రతి గింజా కొంటాం

Do not let the crops dry. We buy every ginja– ‘పంటల బీమా’కు క్యాబినెట్‌ ఆమోదం
– ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు నెరవేరుస్తాం
– కేసీఆర్‌వి వేల అబద్ధాలు..
– అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
నవతెలంగాణ-ఇల్లందు
గతంలో పంట బీమా ఇన్సూరెన్స్‌ పథకం ఉండేదని మళ్ళీ ఈ పథకాన్ని పునర్‌ ప్రవేశపెట్టడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిం దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబా బాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లందు, పినపాక, డోర్నకల్‌, మహబూబాబాద్‌, నర్సంపేట, భద్రాచలం ఎంఎల్‌ఏలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, రామచంద్ర నాయక్‌, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్‌, తెల్లం వెంకటరావు, పార్లమెంట్‌ అభ్యర్థి బలరాం నాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఇన్సూరెన్స్‌ పథకం ద్వారా వైపరీత్యాలు వచ్చిన సందర్భాల్లో పరిహారాలు అందుతాయన్నారు. ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ చేస్తుందన్నారు. పంటలు ఎండిపోకుండా బోర్లు ఇతర మార్గాల ద్వారా నీరందించడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రబీ సీజన్‌లో ప్రతి గింజా కొంటామన్నారు. రాష్ట్రంలో 7,145 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు 92.36 శాతం రైతు బంధు బ్యాంక్‌ అకౌంట్‌లో జమైందని తెలిపారు. మిగతావి త్వరలో జమకానున్నాయన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తొలి బహిరంగ సభ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ఈనెల 6న భారీ ఎత్తున జరగనుందని తెలిపారు. రాజీవ్‌గాంధీ సభా ప్రాంగణంలో జరిగే సభలోనే జాతీయ స్థాయి ఎన్నికల మ్యానిఫెస్టో ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. ఈ సభకు ముఖ్యతిధులుగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, జాతీయ నాయకులు రాహుల్‌, ప్రియాంక గాంధీ రానున్నారని తెలిపారు.
కేసీఆర్‌వి అబద్ధాలు…
మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని మంత్రి తుమ్మల అన్నారు. ఇప్పటికీ అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం వల్ల ఆయన స్థాయి తగ్గించుకున్నారన్నారు. ఉన్న గౌరవాన్ని నిలుపుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని 9 ఏండ్లు పాలించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయకుండా భ్రష్టుపట్టించారని విమర్శించారు. విద్యుత్‌, నీటిపారుదల ప్రాజెక్టులు, ఆర్థిక వనరులు అన్ని నాశనం చేశారని తెలిపారు. వర్షాకాలంలో నీరివ్వనోళ్ళు మండుతున్న ఎండకాలంలో నీళ్ళేవి అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలే అయినప్పటికీ వారు చేసిన తప్పులన్నీ తమపై రుద్దాలని చూస్తున్నారని ఇది తగదని అన్నారు. వారి పాలనలో రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని, తాము అధికారంలో ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని స్పష్టంచేశారు.

Spread the love