పాట మనలో చైతన్యం నింపుద్ది

పాటకు రాయిసైతం కరిపోవల్సిందే. గంటల కొద్ది ఉపన్యాసం చేయలేని పని ఓ చిన్న పాట చేస్తుంది. మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. పాటకు అంతటి ప్రభావం వుంది. అటువంటి పాటతో సమాజంలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుంది. మహనీయుల జీవితాలను పాటలుగా అల్లి ప్రజల్లో చైతన్యం నింపుతుంది. తెలంగాణ ఉద్యమంలో మాటా, పాటతో తన వంతు పాత్ర పోషించింది. ప్రజాగాయినిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమే గంగాజమున. ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
అమ్మ ఏడ్చేసింది
పాటకు రాయయినా కరిగిపోతుంది. పాటలకు అంతటి గొప్పతనం ఉంది. ఎంత గొప్ప ఉపన్యాసం ఇచ్చినా ఒక చిన్న పాట ఎంతో మంది హృదయాలను తాకుతుంది. అందుకే నాకు ఇలాంటి మంచి భవిష్యత్‌ ఇచ్చిన మా అమ్మకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను ఓ చిన్న జ్ఞాపకాన్ని మీతో పంచుకోవాలి. చిన్నప్పుడు ఆడపిల్లపై ఒక పాట విన్నాను. దాన్ని నేర్చుకుని మా అమ్మకు వినిపిస్తే ఏడ్చేసింది. ఎందుకు ఏడ్చిందో అప్పట్లో అర్థం కాలేదు. తర్వాత ఒక రోజు అమ్మతో పాటు బీడీలు చుట్టడానికి కార్ఖానాకు వెళ్ళా. అక్కడ వందల మంది మహిళలు బీడీలు చుడుతూ ఉంటారు. ‘జమునా నువ్వు బాగా పాడతావంట కదా, ఒక పాటపాడరాదు’ అంటే అడ పిల్ల పాటనే అక్కడ కూడా పాడాను. అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు అని పించింది. ఒక పాటకు ఇంతటి ప్రభావం వుందా అని. పాట ఎంతో మందిని కదిలిస్తుంది. అలాంటి పాటతో సమాజాన్ని ఎందుకు మార్చలేం అనే నిర్ణయానికి వచ్చాను. అప్పటి నుండి పాడుతూనే ఉన్నాను.
నిజామాబాద్‌ జిల్లా, సుంకెట గ్రామంలో పుట్టాను. అమ్మ గంగు, నాన్న రాజారాం. నాకు ఇద్దరు తమ్ముళ్లు. చిన్నతనంలోనే నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. అమ్మ బీడీలు చుడుతూ మమ్మల్ని బతికించింది. అమ్మకు సాయంగా నేను కూడా బీడీలు చుట్టేదాన్ని. చాలా కష్టాలు పడ్డాము. మా గ్రామంలోనే ఏడో తరగతి వరకు చదువుకున్నా. ఎనిమిదో తరగతి నుండి డిగ్రీ వరకు సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్లో ఉండి చదువుకున్నాను.
నా ఫొటో పేపర్లో చూసి…
చిన్నప్పటి నుంచి పాటలంటే చాలా ఇష్టం. నా గొంతు బాగుందని అమ్మ చాలా ప్రోత్సహించేది. ఎంత చదువు చదివినా ఏదో ఒక కళలో రాణిస్తే మంచి గుర్తింపు వస్తుందని అంటుండేది. చదువుకునేటపుడు ప్రతి కల్చరల్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనే దాన్ని. డిగ్రీలో ఉన్నప్పుడు ఘంటశాల ఉత్సవాల సందర్భంగ నిజామాబాద్‌ జిల్లా పరిధిలో పాటల పోటీలు జరుగుతున్నాయని పేపర్లో చూశాను. నా పేరు కూడా నమోదు చేసుకున్నా. అందులో పాల్గొన్నందుకు బహుమతి వచ్చింది. ఆ ఫొటో పేపర్లో వచ్చింది. అది చూసి మా అమ్మ చాలా సంతోషించింది.
ఫీజు కట్టలేక మానేశాను
గాయనిగా మంచి పేరు వస్తుందని, సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగా పాడగలనని అమ్మ నన్ను సంగీతం క్లాసులో చేర్పించింది. ప్రముఖ గాయకులు రాజేంద్రప్రసాద్‌ వద్ద జంట స్వరాల వరకు నేర్చుకున్నాను. ఆయన దగ్గర శిష్యురాలిగా చేరడం నాకు దక్కిన మంచి అవకాశం. చాలా ప్రోత్సహించేవారు. ‘నాలుగు నెలలు వచ్చి నేర్చుకో చాలు, నీకు మంచి భవిష్యత్‌ ఉంటుంది’ అన్నారు. కానీ నెలకు ఐదు వందలు ఫీజు కట్టాలి. అమ్మకు చాలా కష్టమయ్యింది. దాంతో నెల రోజులు మాత్రమే నేర్చుకుని మానేశాను. 2010లో పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేరాను. అక్కడ కూడా ఎన్నో బహుమతులు వచ్చాయి. డీన్‌ ధర్మరాజు సార్‌ చాలా ప్రోత్సహించారు. అక్కడే మంజులక్క పరిచయం. తనతో పాటు ప్రతి ప్రోగ్రామ్‌కు తీసుకుపోయేది. పెద్ద పెద్ద గాయకులు పరిచయమయ్యారు. విమలక్క, గోరటి వెంకన్నతో కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా. దేశపతి శ్రీనివాస్‌, రసమయి అక్కడే పరిచయమయ్యారు.
అమ్మ చనిపోయింది…
2012లో అమ్మ గుండెపోటుతో చనిపోయింది. అప్పుడే నా పీజీ అయిపోయింది. తమ్ముళ్ళు చిన్న వాళ్ళు. ఎలా బతకాలో తెలియలేదు. దాంతో కొంత కాలం ఓ స్కూల్లో ఇంగ్లీష్‌ టీచర్‌గా పార్ట్‌ టైం చేశాను. నించున్న దగ్గరే నిలబడి చూస్తుంటే మనమేం చేయలేం. నడుస్తూపోతే అన్నీ మనకు అనుకూలంగా మారతాయి. అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అది అప్పుడే నేర్చుకున్నాను. తమ్ముళ్లు ఉద్యోగం కోసం దుబారు వెళ్ళారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉండేదాన్ని. ‘తల్లి లేదు, తమ్ముళ్లు ఎక్కడో ఉంటున్నారు. ఇలా పాటలంటూ తిరుగుతుంది’ అంటూ నా గురించి కొంత మంది చెడుగా మాట్లాడుకున్నారు. నా తమ్ముళ్ళు మాత్రం నాకు సపోర్ట్‌ చేశారు. ‘నీకు ఇష్టమైన రంగంలో నువ్వు ఉండు, వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకు’ అంటూ అవసరమైనప్పుడు డబ్బులు కూడా పంపించేవారు.
మంచి అవకాశాలు…
యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నా జీవితం చాలా వరకు మారిపోయింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పట్లో ఉద్యమాలకు అడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. 2012లో ఇప్పటి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన సొంత గ్రామం పోచారంలో తెలంగాణ తల్లి విగ్రహం అవిష్కరించారు. అక్కడికి నన్ను ఆహ్వానించారు. అక్కడ దేశపతి శ్రీనివాస్‌ ‘జమున బాగున్నావా, నీ గొంతు చాలా బాగుంది, అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించాను’ అన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇక అప్పటి నుండి ఎక్కడ ఉద్యమం జరుగుతున్నా వెళ్ళి పాటలు పాడేవాళ్ళం. అలాగే గోగు శ్యామలక్కను చూసి స్ఫూర్తి పొందాను. ‘మీలాంటి యువతులు బయటకు రావాలి, సమాజ మార్పు కోసం అమ్మాయిలు బయటకు వచ్చి మాట్లాడాలి’ అనేవారు.
నాయకురాలిగా ఎదిగాను
2013లో స్వేరో నెట్‌ వర్క్‌లో చేరాను. అక్కడే నాకు భాస్కర్‌తో పరిచయం. అప్పటికే భాస్కర్‌ పేరున్న డప్పిస్ట్‌. ప్రవీణ్‌ కుమార్‌ మా ఇద్దరికీ పెండ్లి చేశారు. ఇప్పుడు నేను స్వేరో నెట్‌వర్క్‌ రాష్ట్ర కార్యదర్మిని. దీని ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కరోనా సమయంలో కూడా ఎన్నో చేశాం. ఓ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ సంస్థ ద్వారానే. ప్రస్తుతం డబుల్‌ పీజీ పూర్తి చేసి పీహెచ్‌డీ కూడా చేస్తున్నాను.
మహనీయుల జీవితాలపై…
బుక్కు చదివితే జ్ఞానం వస్తుంది. అందుకే సమాజం కోసం త్యాగాలు చేసిన మహనీయుల జీవిత చరిత్రలు బాగా చదువుతాను. అవి చదివి స్ఫూర్తిపొంది వాళ్ళపై అనేక పాటలు రాశాను. సావిత్రీబాయి, అంబేద్కర్‌, జ్యోతిరావుపై ఎన్నో పాటలు రాశాను. అలాగే ప్రేమ పాటలు కూడా రాశాను. య్యూటూబ్‌ షార్ట్‌ ఫిలింమ్స్‌ కోసం ఎన్నో పాటలు రాశాను, పాడాను. జీసెస్‌ పాటలు, జానపదాలు కూడా రాశాను. ఇలా సుమారు 200 పాటల వరకు రాశాను. మాకు య్యూటూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. నేనూ, భాస్కర్‌ కలిసి పాటలు రికార్డ్‌ చేసి అందులో పెడుతుంటాము.
ఇంటర్వ్యూ : సలీమ
ఫొటోలు : వెంకటేష్‌ పిప్పళ్ల

Spread the love