మ‌మ్మ‌ల్ని మాట్లాడ‌నివ్వండి..

కడలి రౌతు... అక్షరాలు సమాజ మార్పుకు తోడ్పడతాయని బలంగా నమ్మింది. అందుకే తన రచనల ద్వారా సమానత్వం కోసం తపిస్తోంకడలి రౌతు… అక్షరాలు సమాజ మార్పుకు తోడ్పడతాయని బలంగా నమ్మింది. అందుకే తన రచనల ద్వారా సమానత్వం కోసం తపిస్తోంది. స్త్రీల గుండెలోతుల్లో దాగి ఉన్న ప్రతి భావాన్ని తన అక్షరాల్లో ఒలికిస్తోంది. కథలు, కవితలు, ప్రేమలేఖలు, నవలలు అంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న ఆధునిక మహిళ. ఆమె ప్రతి రచన నేటి అమ్మాయిల జీవితాలకు అద్దం పడుతుంది. ఈ పురుషాధిక్య సమాజంతో పోరాడే శక్తినిస్తుంది. ఆమేంటో ఆమెకు తెలిపే ప్రయత్నం చేస్తోంది. ఇలా అక్షరాలే జీవితంగా బతుకుతున్న ఆమెతో మానవి సంభాషణ…
మీ బాల్యం ఎలా సాగింది?
నేను ఖమ్మంలో పుట్టి పెరిగాను. అమ్మ కవిత, ప్రభుత్వ ఉద్యోగి. నాన్న రౌతు రవి. మా నాన్న ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తుండేవాడు. వాటిని మా అమ్మ ఎంతో ఆసక్తిగా చదివేది. అంతే కాదు రాసిన వాటి గురించి ఇంట్లో ఎప్పుడూ చర్చలు జరుగుతుండేవి. అది చూసి వాటిల్లో ఏముందో తెలుసుకోవాలనే కుతూహల నాకూ ఉండేది. ఐదారేండ్లు వచ్చినప్పటి నుండి నేనూ చదవడం మొదలుపెట్టాను. పుస్తకాలపై అవగాహన ఏర్పడింది. నాన్న ఏం రాసినా ప్రజాసమస్యలపైనే రాసేవారు.
రాయడం ఎప్పుడు మొదలుపెట్టారు?
చిన్నప్పటి నుండే నేను రాసిన కవితలు పత్రికల్లో వచ్చేవి. ప్రతి విషయంపై అక్షరాల ద్వారా స్పందించడం నాన్న నుండే నేర్చుకున్నాను. చదవడం, రాయడం మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో బాగా ప్రోత్సహించేవారు. ఏదైనా రాసిన రోజు అమ్మ నాకు చాక్లెట్‌ కొనిచ్చేది. ఇదేదో బాగుంది కదా అని ఇంకా రాసేదాన్ని. అలాగే నాకేమైనా కావాలంటే మాటలతో అడగడం కన్నా లెటర్‌ రూపంలో రాసి ఇస్తే దానికి త్వరగా స్పందించేది అమ్మ. ఒకసారి అలా డీవీడీ ప్లేయర్‌ కొనిపిచ్చింది. మాటల కన్నా అక్షరాల ద్వారా మన భావాలను అర్థమయ్యేలా చెప్పొచ్చని అర్థమై అప్పటి నుండి నా ఫీలింగ్స్‌ను రాయడం మొదలుపెట్టాను. మొదట్లో ఏదో అలా రాసినా ఓ పదేండ్ల నుండే సీరియస్‌గా రాస్తున్నాను.
మీ చదువు ఎలా సాగింది..?
చదువులో చిన్నప్పటి నుండి టాపర్‌ని. స్కూలింగ్‌, ఇంటర్‌ ఖమ్మంలోనే పూర్తి చేశాను. ఆ తర్వాత డిగ్రీలో బిఎస్సీ, మాస్టర్స్‌ ఇంగ్లీష్‌ లెటరేచర్‌ ఉస్మానియాలో పూర్తి చేశాను. అలాగే ఉమెన్స్‌ స్టడీస్‌లో పీజీ డిప్లొమా కూడా చేశాను. చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడక్కడ ఉద్యోగాలు కూడా చేశాను. అయితే నాకు కావల్సింది ఏంటీ, నేను వెళ్లాల్సిన దారి ఏదీ అనేది తెలుసుకోవడానికి కాస్త టైం పట్టింది. మొత్తానికి ఇప్పుడు ఇలా రచయితగా స్థిరపడిపోయాను.
ఓ రచయితగా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా?
ఎదుర్కొన్నాను. నేను రాసినవి చూసి చాలా మంది రకరకాలుగా మాట్లాడేవారు. పీరియడ్స్‌ గురించి రాస్తే ‘నీకొక్కదానికే పీరియడ్స్‌ వస్తాయా, ప్రపంచంలో నువ్వొక్కదానివే అమ్మాయివా, మిగిలిన వాళ్లెవరికీ రావా’ అనే వారు. నాకే కాదు ఇలా రాసే ప్రతి అమ్మాయి ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటుంది. అంతే కాదు ‘ఆ అమ్మాయి మోహం చూపించి, అందమైన బట్టలు వేసుకొని, మేకప్‌ వేసుకొని పుస్తకాలు అమ్ముకుంటుంది’ అన్నవాళ్లూ ఉన్నారు. పెద్దపెద్ద వాళ్లు కూడా ఇలా మాట్లాడడం చూస్తే చిర్రెత్తి పోయేది. ఎవరు ఏమనుకున్నా నాకు తెలిసింది, నాకు వినిపించింది, కనిపించింది, నేను అనుభవించింది, కేవలం నేను అమ్మాయిని కావడం వల్ల కోల్పోయింది ఇలా ప్రతి విషయాన్ని రాస్తున్నాను. నేను అనుభవించింది, నేను మహిళను అయినందుకు నాకు అందకుండా పోయింది ఇలా ప్రతి విషయాన్ని రాస్తున్నాను. ఎవరు ఏమన్నా చిన్నప్పటి నుండి నాన్న నన్ను ప్రతి విషయంలో వెనకేసు కొచ్చేవారు.
ఫెమినిజం గురించి మీరేం చెబుతారు?
చాలా మంది మగవాళ్లు ఫెయినిజం అనే పదం వినగానే ఉలిక్కి పడతారు. వీళ్లు మగవాళ్లకు వ్యతిరేకులు అనుకుంటారు. అయితే పితృ స్వామ్యానికి వ్యతిరేకం మాతృస్వామ్యం కాదు. సమానత్వం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏండ్లు గడుస్తున్నా సమానత్వం కోసం అడుక్కోవలిసి వస్తుంది. చారిత్రాత్మకంగా దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఐదు రోజుల రుతుస్రావాన్ని అడ్డం పెట్టుకొని స్త్రీలను వెనక్కు నెట్టేస్తున్నారు. సమాజంలో దీన్ని ఇప్పటికీ ఆడవాళ్ల బలహీనతగా భావిస్తున్నారు. బిడ్డకు జన్మ ఇవ్వడం స్త్రీలో ఉన్న గొప్ప విషయం అని తెలుసుకోలేక పోతున్నారు. దాన్ని గౌరవిస్తే సమానత్వం దానంతట అదే వస్తుంది. మగవారు పనిగట్టుకొని మహిళలను ఉద్దరించాల్సిన అవసరం లేదు. ఒక మహిళ తన సమస్యపై మాట్లాడుతుంటే తనకు అండగా నిలబడితే చాలు. ఆమెను గొంతు విప్పి మాట్లాడనిస్తే చాలు.
రచనల వల్ల సమానత్వం వస్తుందంటారా?
కచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది మగవారు రాతల్లో మాత్రమే సమానత్వం చూపిస్తారు. చేతల్లో వారి నిజస్వరూపాలు కనిపిస్తాయి. మహిళను కించపరిచేలా మాట్లాడతారు. అందుకే రాసే మహిళల సంఖ్య పెరగాలి. అమ్మాయిలకు రాసే అవకాశం కల్పించాలి, ప్రోత్సహించాలి. అప్పుడే సమాజంపై సాహిత్యం మంచి ప్రభావం చూపిస్తుంది. అలాగే స్త్రీలను అర్థం చేసుకొని, గౌరవించి, వాళ్ళ అవసరాలను గుర్తించే మగవారి సంఖ్య పెరిగినప్పుడు ఇంకా త్వరగా సమానత్వం వస్తుంది. నేటి తరంలో కొంత వరకు ఆ మార్పు చూస్తున్నాను. ఈ మార్పు ఇంకా రావాలి.
రచనకు అవకాశం ఉన్న అన్ని రంగాలలో అడుగుపెట్టారు, ఇది ఎలా సాధ్యమైంది?
పుస్తకాలు బాగా చదువుతాను. రీసర్చ్‌ చేస్తాను. ఏదైనా నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. కాబట్టే పాటలు రాశాను, సినిమాలకు స్క్రిప్ట్‌ రాశాను. వంద పాటల వరకు రాశాను. రెండు సినిమాలకు డైలాగులు, మూడు సినిమాలకు స్క్రీన్‌ప్లే రాశాను. ‘ఇట్స్‌ ఓకే గురు’ అనే సినిమా త్వరలో రిలీజ్‌ కాబోతుంది. ‘సత్య’ అనే ఓ షాట్‌ ఫిలింకి డైలాగ్స్‌ రాశాను. స్క్రీన్‌ ప్లే రాసిన సినిమాలు ప్రస్తుతం ఆగిపోయాయి. అలాగే కథలు రాసి కడలి కథలు పేరుతో పుస్తకంగా తీసుకొచ్చాను.
మీకు బాగా స్ఫూర్తినిచ్చిన రచయిత?
చలం… ఆయన రాసిన శశిరేఖ, అనసూయ, జీవితాదర్శం చాలా ఇష్టంగా చదివాను. చలం పేరును పచ్చబొట్టు కూడా వేసుకున్నాను. అంత అభిమానిస్తా చలాన్ని. ఆయన్ని నిరంతరం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. స్త్రీ, బిడ్డల శిక్షణ పుస్తకాలు ఎన్ని సార్లు చదివానో లెక్కేలేదు. ఆయన పుస్తకాలు చదివేటప్పుడు అందులో పాత్రలు నేను అనే ఫీలింగ్‌లోకి వెళ్లిపోతాను. బాధ పడాల్సిన విషయం ఏమిటంటే స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడినందుకు ఆయన వెలివేయబడ్డారు.
ఇటీవల విడుదలైన చిక్‌లిట్‌ నవల గురించి చెప్పండి?
దీని కోసం రెండేండ్లు రీసర్చ్‌ చేశాను. నవలకు కావల్సిన పాత్రల కోసం చాలా మందితో మాట్లాడాను. నేను రాసింది ఏదైనా నేనూ మీలో ఒకదాన్నే అని సమాజానికి చెప్పడం కోసమే రాస్తాను. మహిళలను ఓ స్థాయిలో ఉంచేందుకు ప్రయత్నిస్తాను. ఇందులోని షాలినీ పాత్ర కూడా అలాంటిదే. పాఠకుల్లో మంచి ఆధరణ పొందింది.
మీ ప్రేమ లేఖల గురించి కూడా చెప్పండి?
వైజాగ్‌లో సోలో ట్రావెలింగ్‌కి వెళ్లినపుడు బీచ్‌లో కనిపించిన ఓ సంఘటనను తీసుకొని ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టాను. అలా 40 సంఘటలను 40 లేఖలుగా తీసుకొచ్చాను. వాస్తవానికి ప్రేమ ముసుగులో రాసిన విప్లవ కథలుగా వీటిని నేను భావిస్తాను. అమ్మాయిల్లోనూ ప్రేమ, దాని ఫీలింగ్స్‌ ఎలా ఉంటాయో వీటి ద్వారా సమాజానికి చెప్పగలిగాను.
భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటున్నారు?
రాస్తూనే ఉంటాము. త్వరలో కవిత్వం పుస్తకం తీసుకురావాలి. అలాగే ఓ నవల సగంలో ఉంది అది కూడా పూర్తి చేయాలి. సమానత్వం వచ్చే వరకు రాస్తూనే ఉంటాను. ఎన్నో ఏండ్లు పోరాటాలు చేస్తే ప్రస్తుతం మనం ఇలా బతకగలుగుతున్నాం. ఇక మనం కోరుకున్న సమానత్వం రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ఓ అమ్మాయి అర్థరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడు అందులో నా పాత్ర కూడా కొంత ఉంది అనే ఫీలింగ్‌ రావాలి. ఆ తృప్తి పొందేందుకు రాస్తూనే ఉంటాను.
మాట్లాడుతూనే ఉండాలి
ప్రస్తుత సమాజంలో అసలు మాట్లాడకుండా ఉండడం కంటే ఏదో ఒకటి మాట్లాడడం చాలా అవసరం. కచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడీ మాట్లాడీ చెవులు ఊదరగొడితే కానీ సమాజానికి అర్థమయ్యే పరిస్థితి లేదు. కనుక ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది. పిల్లలకు కూడా తల్లే అన్నీ నేర్పించాలి, అన్నీ చెయ్యాలి అనే ఫీలింగ్‌ బాగా ఉంది. పిల్లల పెంపకంలో తండ్రికి ఎలాంటి బాధ్యత ఉండదు. ఇందులో మార్పు రావాలి. కుటుంబ పరువును కాపాడాల్సిన బాధ్యత కూడా స్త్రీలపైనే మోపారు. అత్యాచారానికి గురైతే ఆమె తన పవిత్రను కోల్పోయింది అంటుంటారు. దీనివల్లే అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెండ్లి విషయంలో, ఏ వ్యక్తితో, ఎలా బతకాలి అనే విషయంలో అమ్మాయిలకు చాయిస్‌ ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు. సమానత్వం గురించి మాట్లాడితే ఈమె తెగబడింది అంటారు. అలా మాట్లాడే స్త్రీలపై నిందలు వేస్తుంటారు. ఆ అవకాశాన్ని వాళ్లకు మనం ఇవ్వకూడదు.

Spread the love