ప్రాణాంతక ఆయుధాలను నిషేధించాలి

Lethal weapons should be banned– యుద్ధాలు, మరణాల నుంచి లాభాలను ఆర్జించరాదు : పోప్‌ ఫ్రాన్సిస్‌
బోర్గో ఎగ్నాజియా, ఇటలీ : ప్రాణాంతకమైన స్వయంప్రతిపత్తి ఆయుధాలపై నిషేధం విధించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపిచ్చారు. ఇటలీలో జరుగుతున్న జీ-7 నేతల సదస్సులో కృత్రిమ మేథస్సు యొక్క ప్రమాదాలపై ఆయన ప్రసంగించారు. ”సాయుధ ఘర్షణల విషాదాల నేపథ్యంలో ఈ ‘ప్రాణాంతకమైన స్వయంప్రతిపత్తి ఆయుధాలు’ అభివృద్ధి, వినియోగం గురించి పున:పరిశీలించాల్సిన అత్యవసరం వుంది. అంతిమంగా వాటి వినియోగాన్ని నిషేధించాలి.” అని పోప్‌ విజ్ఞప్తి చేశారు. ”గొప్పదైన, సక్రమమైన మానవ నియంత్రణను ప్రవేశపెట్టడానికి సమర్ధవంతమైన, నిర్దిష్టమైన నిబద్ధత నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఒక మానవుని ప్రాణాన్ని తీసేయడానికి యంత్రాలను ఎన్నడూ ఎంపిక చేసుకోరాదు.” అని ఆయన వ్యాఖ్యానించారు.
జీ-7 సదస్సుకు హాజరైన తొలి కేథలిక్‌ చర్చి అధినేత పోప్‌ ఫ్రాన్సిస్‌, ఆయుధ పరిశ్రమ పట్ల ఎప్పుడూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వుంటారు. యుద్ధాలు, మరణాల నుంచి లాభాలను ఆర్జించరాదని ఆయన వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథస్సును ఇప్పటికే యుద్ధ రంగాల్లో ఉపయోగిస్తున్నారు. ఆధునిక యుద్ధ తంత్రాల్లో దీన్ని ఉపయోగించాలన్న ఆలోచన వల్ల పెరిగే ఘర్షణల ముప్పు, నిర్ణయాలు తీసుకోవడంలో మానవుల పాత్ర వంటి అంశాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేథస్సు చాలా ఉత్తేజితకరమైన, భయాందోళనలు కలగచేసే సాధనమని ఆయన సదస్సులో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఎఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, అయితే అది సురక్షితమైన, నైతికమైన సాధనం కాదని అన్నారు. యంత్రాలపై ఆధారపడడం ద్వారా మానవులు తమకు తాము నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని మనం లాగేసుకోరాదని ఆయన హెచ్చరించారు.

Spread the love