– ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే లక్ష్యం : ప్రధాని మోడీతో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు భేటీ
న్యూఢిల్లీ: భారత్, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు న్యూఢిల్లీలో పర్యటించారు. మాల్దీవుల్లో భారత్ సహకారంతో చేపట్టిన కొత్త రన్‌వే ప్రారంభోత్సవం, అధికారికంగా రూపే కార్డును ప్రారంభించడం వంటి చర్యలు ఇరు దేశాల మధ్య ఆర్థిక, పర్యాటక సహకారాన్ని పెంచుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ముయిజు ఇరువురూ కలిసి సంయుక్తంగా హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. మాల్దీవుల్లో రూపే చెల్లింపుల సేవలను కూడా ఆరంభించారు. అంతకుముందు ఇరువురు నేతలు విస్తృతంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకున్నారు. భవిష్యత్ సహకారానికి కొత్త పంథాను రూపొందిం చామన్నారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు. భారత పర్యాట కులకు ఈ సందర్భంగా ముయిజు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. భారత టూరిస్టులు తమకెంతో విలువైన వారని, వారు తమ ఆర్థిక వ్యవస్థపై సాను కూలమైన ప్రభావాన్ని చూపుతారని పేర్కొన్నారు. ముయిజు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇదే ప్రధమం. అధి కారంలోకి వచ్చిన వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల సంబంధాల్లో ఒడిదుడుకులు తలెత్తాయి. మాల్దీవుల్లో భారత పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. మాల్దీవుల పర్యాటక రంగం బాగా దెబ్బతింది.దీంతో పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత తీసుకున్న ముయిజు భారత ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.