– మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీవో 46పై ఉన్న సందేహాలు, ఇతర సాకేతిక సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం బీఆర్‌ఎస్ నేత రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బాదితులు హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రిని కలిసి జీవోతో జరిగే నష్టంపై వివరించారు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందని తెలిపారు. జీవో46ను రద్దు చేసి, న్యూమరికల్ పోస్ట్‌లను సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతిక సమస్యలపై సమాలోచన చెయ్యడానికి సిద్ధమనీ, అవసరమైన పత్రాలు సమర్పిస్తామని బాదితులు వివరించారు. ఈ నెల 19న జీవో 46పై హైకోర్టులో జరిగే విచారణకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. జీవో 46 రద్దుపై శాసనసభ సబ్ కమిటీలో చర్చించి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని ఈ సందర్భంగా పొన్నం బాదితులుకు హామీ ఇచ్చారు.