ఇక్కడ చేస్తే ఊరుకోం

Let's do it here– ఆందోళనలు ఆంధ్రాలో చేసుకోండి
– ఆ వ్యవహారంలో మేం తటస్థంగా ఉన్నాం : చంద్రబాబు అరెస్టుపై మంత్రి కేటీఆర్‌
– తెలంగాణ ఏర్పాటును మోడీ కించపరుస్తున్నారని వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పంచాయితీ ఆంధ్రాలోనే తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వబోమని స్పష్టం చేశారు. అక్కడ రాజకీయ విభేదాలకు తెలంగాణ ప్రజలను తెదేపా, వైకాపా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు అరెస్టు ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం. మా పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తగత వ్యవహారం. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపించే అంశం కాదు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదు. ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే అక్కడే చేయాలి. అక్కడ చేయకుండా ఇక్కడ రాజకీయ రాద్ధాంతం చేస్తానంటే ఎలా?. ఇక్కడ మేం ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. శాంతిభద్రతల సమస్య వస్తే ఎలా? ఇలాంటి వాటికి ఇక్కడ ఎలా అనుమతిస్తాం. వాళ్ల ఘర్షణలకు హైదరాబాద్‌ వేదిక ఎలా అవుతుంది.? ఆ రెండు పార్టీలకు తెలంగాణలో ఉనికి లేదు.. స్థానం లేదు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలసి ఉన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మేం తటస్థంగా ఉన్నాం. ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలు. వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలి. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ సమయంలో రోడ్లపైకి వచ్చి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడ కూడదు. చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకు జరగాల్సిన న్యాయం కోర్టుల్లో జరుగుతుంది అని కేటీఆర్‌ వివరించారు.
అందరూ దోస్తులే
”లోకేశ్‌ .. జగన్‌.. పవన్‌ కల్యాణ్‌ నాకు మంచి స్నేహితులు. అందరూ దోస్తులే. ఆంధ్రాలో నాకు తగాదాలు లేవు. ఇప్పటికిప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే వారికి కూడా అలాంటి అవసరం లేదు. ప్రాంతాలతో సంబంధం లేకుండా హైదరాబాద్‌లో అందరూ కలిసి మెలసి ఉంటున్నాం. ఇక్కడున్న ఆంధ్రా ప్రజలు పదేండ్ల నుంచి సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదు. ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఓ మిత్రుడి ద్వారా లోకేశ్‌ ఫోన్‌ చేయించారు. ఒకరికి అనుమతిస్తే ఇంకొకరు ర్యాలీ చేస్తారు. అందుకే అనుమతించడం లేదని చెప్పా. ఐటీ కారిడార్‌లో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉద్యమాలకు అప్పటి ప్రభుత్వాలు కూడా అనుమతి ఇవ్వలేదు. ఐటీ కార్యకలాపాలు దెబ్బతినొద్దు. ఏపీ నుంచి ఎంతో మంది ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ల పెట్టుబడులు, భవిష్యత్తు బాగుండాలి. అలా ఉండాలంటే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉండాలి” అని కేటీఆర్‌ అన్నారు.
తెలంగాణపై విషం చిమ్మిన మోడీ
అమృతకాల సమావేశాల్లో ప్రధాని మోడీ తెలం గాణపై ఎందుకు విషం చిమ్మారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ”పదే పదే తెలంగాణ ఏర్పాటును మోడీ కించపరుస్తున్నారు. తెలంగాణపై పగబట్టినట్టు మాట్లాడుతున్నారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని పదే పదే అంటున్నారు. 14 ఏండ్లు కేసీఆర్‌ పోరాడితే తెలంగాణ వచ్చింది. ప్రధాని చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు తప్పకుండా వివరణ ఇవ్వాల్సిందే. పాలమూరు-రంగారెడ్డి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. పాలమూరు పచ్చ బడుతుంటే భాజపా నేతల కండ్లు మండుతున్నాయి” అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.
వాటా తేల్చే తీరిక ప్రధాని మోడీకి లేదా?
పాలమూరులో కాలు పెట్టే నైతిక హక్కు ప్రధాని మోడీకి లేదు. నదీ జలాల్లో వాటా తేల్చాలని కేసీఆర్‌ అడిగి పదేండ్లైంది.. సీఎం అయిన నెల రోజుల్లోనే కేసీఆర్‌.. మోడీని కలిసి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చే తీరిక ప్రధాని మోదీకి లేదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అమరావతికి తట్టెడు మట్టి, తొట్టెడు నీళ్లు మాత్రమే ఇచ్చారు. ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్లడం మోడీకి అలవాటే. ఈసారి కూడా 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హౌదా ఇవ్వాలని అడిగాం. తొమ్మిదిన్నరేండ్ల తరువాత అయినా ప్రధాని మోడీ పాప పరిహారం చేసుకోవాలి. రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై పగబట్టాయని విమర్శించారు.
గవర్నర్‌ పదవికి తమిళిసై అర్హురాలు కాదు..
”ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎమ్మెల్సీ లుగా కేబినెట్‌ సిఫార్సు చేసింది. గవర్నర్‌ మనసుతో ఆలోచించి ఉంటే తిరస్కరించేవారు కాదు. రాజకీ యాల్లో ఉన్న వారిని సిఫారసు చేయొద్దని గవర్నర్‌ అన్నారు. ఈ నియమం ఆమెకు వర్తించదా? గవర్నర్‌ అయ్యే ముందు వరకు తమిళిసై తమిళ నాడు భాజపా అధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రత్యక్ష రాజ కీయాల్లో ఉన్న వారు గవర్నర్‌ గా వ్యవహరించ కూడదని సర్కారియా కమిషన్‌ స్పష్టంగా చెప్పింది. గవర్నర్లు మోడీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా కూడా ఎమ్మెల్సీగా ఎన్నిక య్యారు. గవర్నర్‌ ఇప్పటికీ భాజపా నేతగా వ్యవహ రించట్లేదా? తెలంగాణలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో నూ గవర్నర్లు మోడీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. మీకో న్యాయం ఇతరులకో న్యాయమా? గవర్నర్‌ పదవికి తమిళిసై అర్హురాలు కాదు. బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను శాసనమండలికి తీసుకొస్తామంటే మీ కేంటి ఇబ్బంది. ఎవరు అర్హులు..ఎవరు అనర్హు లో? ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం” అని కేటీఆర్‌ సవాల్‌ చేశారు.

Spread the love