బీజేపీ ఎంపీ భూషణ్‌ పై చర్యలు తీసుకునేదాకా పోరాడుదాం

నవతెలంగాణ-కాప్రా
బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ పై చర్యలు తీసుకునే వరకు పోరాడుదామని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ, ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గురువారం ఈసీఐఎల్‌ అంబేద్కర్‌ చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు.సీఐటీయూ మాజీ జిల్లా అధ్యక్షుడు కోమటి రవి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్‌ సంతోష్‌లు మాట్లాడుతూ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకునే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలియజేశారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద మహిళా రెజ్లర్లు నిరసన తెలుపుతుంటే బీజేపీ ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడం సిగ్గుచేటు అన్నారు. శరణ్‌ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, అతని పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, అసోసియేషన్‌ పదవి నుంచి తొలగించాలని, మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అంతర్జాతీయంగా పతకాలు సాధించి దేశానికి గౌరవాన్ని, ప్రతిష్టను తెచ్చిపెడుతున్న ఒలింపిక్‌ పతక విజేతలపై ఈ రకమైన దాడులు జరగడం శోచనీయమన్నారు. ఒకవైపు భేటీ పడావో భేటీ బచావో అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నినాదాలు ఇస్తూ మరోవైపు ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాయడం సిగ్గుచేటని అన్నారు. దోషులను శిక్షించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్‌ నాయకులు యాదగిరిరావు, సీఐటీయూ కోశాధికారి ఉన్ని కష్ణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.గణేష్‌, సహాయ కార్యదర్శి జి. శ్రీనివాసులు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నర్సింగరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సరిత, శిరీష, మోనికా, విద్యార్థులు, కార్మికులు పాల్గోన్నారు .

Spread the love