సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే దోమలు చాలా ఇబ్బంది పెడతాయి. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దోమలను నివారించడానికి వాడే లిక్విడ్స్, కాయిల్స్ వాసన కొంతమందికి పడదు. దాంతో మరిన్ని శ్వాస, చర్మ సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటితో పని లేకుండా సహజమైన ఇంటి చిట్కాలతో దోమలను తరిమేయవచ్చు. ప్రస్తుతం జ్వరాలు ప్రబలుతున్న సమయంలో ఇంటి లోపల, పరిసరాలలో దోమలు లేకుండా చూసుకోవడం అనివార్యం.. వీటి నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం…
కర్పూరం: దోమలను తరిమేయడానికి కర్పూరం బాగా పని చేస్తుంది. దీని ఘాడమైన వాసన దోమలను ఇంట్లోకి రానివ్వదు. ఇందుకు చేయాల్సిందల్లా అన్ని తలుపులు మూసేసి కర్పూరం కాల్చడం. 30 నిమిషాల తర్వాత అన్ని తలుపులు తెరవొచ్చు. ఇది దోమలను పూర్తిగా నిర్మూలించడంలో ఎంతో ఉపకరిస్తుంది. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.
వెల్లుల్లి : దోమలను దూరంగా ఉంచడానికి వెల్లుల్లి కూడా బాగా పని చేస్తుంది. కొన్ని లవంగాలు, వెల్లుల్లిని చూర్ణం చేసి నీటిలో ఉడకబెట్టుకోవాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసి ఇంటి మూలల్లో పిచికారీ చేయవచ్చు. క్షణాల్లో దోమల నుండి విముక్తి పొందవచ్చు.
కాఫీ: కాఫీ గింజలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొద్దిగా కాఫీ గింజలను నీటిలో మరగబెట్టి దోమలు ఎక్కువగా తిరిగేచోట చల్లాలి. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
లావెండర్ ఆయిల్ : లావెండర్ నూనె నుండి వచ్చే వాసన కూడా దోమలను తరిమేస్తుంది. ఇంటి పరిసర ప్రాంతాలలో లావెండర్ నూనెను పిచికారీ చేయండి. అలాగే దోమ కాటును నివారించడానికి ఈ నూనెను శరీరంపై పూయవచ్చు. ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయదు.
పుదీనా : లావెండర్ ఆయిల్ మాదిరిగా దోమలను తిప్పి కొట్టడానికి పుదీనా కూడా బాగా పని చేస్తుంది. తాజా పుదీనా లేదా పుదీనా నూనె తీసు కొని మీ చుట్టూ పిచికారీ చేసుకుంటే దోమల బెడద నుండి తప్పించుకోవచ్చు. పుదీనా మొక్కలను ఇంట్లో పెంచుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
టీ ట్రీ ఆయిల్ : ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. గాయాలు, అనేక వ్యాధులకు దీనితో చికిత్స చేస్తారు. ఇది దోమలను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. టీ ట్రీ ఆయిల్ కొన్ని చుక్కలను నీటితో కలిపి స్ప్రే బాటిల్‌లో కలపండి. ఇంటి మూలల్లో పిచికారీ చేసుకుంటే దోమల నుండి ఉపశమనం పొందవచ్చు.
తులసి ఆకులు : తులసి ఆకులు దోమల లార్వాలను చంపడానికి సహాయ పడతాయి. పెరట్లో లేదా ఇంటి ప్రవేశద్వారం వద్ద ఒక తులసి మొక్కను నాటవచ్చు. ఇది దోమల సమస్య నుండి బయటపడటానికి ఉపయోగపడుతుంది.