– ఖమ్మం జిల్లాకు భట్టి, రేణుక రెండు కండ్లు.. పొంగులేటి మూడో కన్ను
– అధికారంలోకి రాగానే నూటికి నూరుపాళ్లు ధరణీ పోర్టల్ రద్దు
– పదవి ఇవ్వనందుకు మీ అయ్య టీడీపీని వీడలేదా..?
– పొంగులేటిపై కేటీఆర్ వ్యాఖ్యలకు : రేవంత్‌రెడ్డి కౌంటర్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
”ఖమ్మం సభతో బీఆర్‌ఎస్ పాలనకు సమాధి కడతామని, తమ శీనన్న మూడో కన్నులాంటివాడని, శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో.. బీఆర్‌ఎస్ పరిస్థితి కూడా అంతే అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందన్నారు. తెలంగాణ జన గర్జన సభ సాక్షిగా బీఆర్‌ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. జులై 2న ఖమ్మంలో జరిగే రాహుల్ సభ ఏర్పాట్ల పరిశీలన కోసం శుక్రవారం ఖమ్మం వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎన్ని అడ్డుగోడలు పెట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని పడగొట్టి ఖమ్మం సభకు హాజరవుతారని అన్నారు. పార్టీలో పాత, కొత్త లేకుండా నాయకులందరం కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలిపిస్తే.. రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత తమదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించి బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని స్పష్టంచేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో నాలుగైదు నెలలుగా చర్చలు జరిపామని, కార్యకర్తలు, అభిమానులతో చర్చించాకే వారి అభీష్టం మేరకు కాంగ్రెస్‌లో చేరాలని పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లాకు భట్టి విక్రమార్క, రేణుక రెండు కండ్లయితే.. పొంగులేటి మూడో కన్ను అని అన్నారు. జులై 2న ఖమ్మం సభ వేదికగా సమరశంఖం పూరించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందన్నారు.
టికెట్లు ఇవ్వనందుకే పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళుతున్నాడనే కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఆనాడు చంద్రబాబు పదవి ఇవ్వకపోతేనే కదా.. కేసీఆర్ టీడీపీని వీడిందని చురకులు అంటించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సాయంగా ఉండేందుకు పొంగులేటి 1500 బస్సులు సభ కోసం అద్దెకు తీసుకోవాలనుకున్నా.. బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మంత్రి పువ్వాడను ఉద్దేశించి ఆరోపించారు. బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా.. నడుచుకుంటూనైనా ఇక్కడి ప్రజలు సభకు వస్తారని, మీరు అడ్డుగోడలు కడితే దూకి వస్తారని, మీరే అడ్డు వస్తే తొక్కుకుంటూ వస్తారని స్పష్టంచేశారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కదిలారన్నారు. భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి వెయ్యి కిలోమీటర్లు నడిచారని, అందుకే కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. సచివాలయానికి రాని కేసీఆర్‌ను ప్రజల బాట పట్టించామన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. మరో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. అధికారంలోకి రాగానే నూటికి నూరుపాళ్లు ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ, నాయకులు మల్లు రవి, బలరాంనాయక్, వి.హనుమంతరావు, పొంగులేటి ప్రసాదరెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.