– పట్టణ పేదలకు పనులు విస్తరింపజేయాలి : ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఉపాధి హామీ పరిరక్షణ కమిటీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ చట్ట పరిరక్షణకు పోరాటాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా కేంద్ర బడ్జెట్‌లో నిధులను తగ్గిస్తూ పథకాన్ని నీరుగారుస్తున్నారన్నారు. వారం రోజుల్లో చెల్లించాల్సిన వేతనాలు ఆరు నెల్లైనా చెల్లించకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. సమ్మర్ అలవెన్స్ చెల్లించడం లెదన్నారు.ఉపాధిహమి పట్టణాలలో గహ కార్మికులు,చెత్త ఎరె కార్మికులు భవన నిర్మణా కార్మికుల కు పని దొరకక పస్తులు వుంటున్నందున పట్టణ పేదలకు ఉపాది హమి పని కల్పించాలని డిమాండ్ చేశారు. బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ మాట్లాడుతూ ఎన్‌డీఏ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులను ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నదని విమర్శించారు. పట్టణ పేదలకు ఉపాధి పని పెట్టాలనే సోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. చేసిన పనికి చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వకుండా అరకొర ఇస్తున్నారు. తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కన్వీనర్ పద్మ మాట్లాడుతు కేరళలోని వామపక్ష ప్రభుత్వం మాదిరిగా పట్టణ పేదలకు ఉపాధి పనులు పెట్టాలని డిమాండ్ చేశారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు నాటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ప్రతి కుటుంబానికి వంద రోజులు పనిని గ్యారెంటీ చేస్తూ ప్రభుత్వమే పని కల్పించే విధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టంను పార్లమెంటు ఆమోదించిందని తెలిపారు.పీఎంసీ రాష్ట్ర కన్వీనర్ శివలింగం,టీవీవీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం వెంకటయ్య, డీబీఎస్‌యూ రాష్ర ప్రధాన కార్యదర్శి జి.నర్సింహ్మ, బీకేఎంయూ నాయకులు కాంతయ్య, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, సంజివ్, ఎగొండ, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.