జీవో 111 పరిరక్షణకు ఉద్యమిద్దాం

–  ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మౌనం వీడాలి: ఎంపీ ఆర్‌ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి
నవ తెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జీవో 111 పరిరక్షణకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మౌనం వీడి న్యాయపోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్‌ కష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లోని విద్యానగర్‌ బీసీ భవన్‌లో 111 జీవో పరిరక్షణకోసం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఆర్‌ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు సాయిబాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ 111 జీవో పరిరక్షణ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నోరువిప్పటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. జీవో 111 పై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రూ. 2 లక్షల కోట్ల అవినీతి జరిగే అవకాశం ఉందనీ, సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చెరువులను కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి మాట్లాడుతూ. జీవో111 ద్వారా హైదరాబాద్‌ సురక్షితంగా ఉందని గుర్తుచేశారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు కేసీఆర్‌ ప్రభుత్వం జీవో ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవటం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడమేంటని ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు దోపిడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వాధినేతలు, మంత్రులు ఐటీఐ పరిధిలో సొంత ఇండ్లు, ఫాం హౌస్‌లు కట్టుకొని వరదలు వస్తే అధికారులను బెదిరించి తూములు వదులుతున్నారని గుర్తుచేశారు. ఈ దీక్షలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్‌, లాల్‌ కృష్ణ, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love