– ఆహార భద్రత కల్పన నుంచి తప్పించుకోజూస్తున్న కేంద్రం
– కేరళ వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలుద్దాం: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం..మనుధర్మాన్ని వ్యతిరేకిద్దామంటూ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమా వేశాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాజ్యాంగం అమలుల్లోకొచ్చి 75 ఏండ్లు నిండిన సందర్భంగా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మనుధర్మాన్ని వ్యతిరేకిద్దాం నినాదంతో దేశవ్యాప్తంగా దళిత, గిరిజన వాడల్లో విస్తృతంగా సదస్సులు సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకొచ్చిన తర్వాత ఆహార భద్రత చట్టాన్ని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేసే చర్యలను వేగవంతం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు లింక్ పేరుతో ఉపాధి జాబ్ కార్డులను ఏడు లక్షలు, తెల్ల రేషన్ కార్డులు ఐదు లక్షల 80 వేలు తొలగించారని చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు, సామాజిక న్యాయం అమలకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రయివేట్ రంగంలోని ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్, షీస్ వర్కర్స్ వంటి రిక్రూట్ మెంట్‌లో రిజర్వేషన్లు అమలకు సిద్ధపడటం లేదని చెప్పారు. ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేస్తున్న వామపక్ష కేరళ ప్రభుత్వానికి ఆర్థిక సహకారాన్ని నిరాకరించడం ద్వారా దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఇది రాష్ట్రాల ఫెడరల్ హక్కులను హరించడమేనన్నారు. కేరళ వామపక్ష ప్రభుత్వ రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం అండగా నిలబడడానికి దేశవ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బొప్పని పద్మ, పొన్నం వెంకటేశ్వరరావు, అల్వాల వీరన్న, ములకలపల్లి రాములు, జగన్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పెద్ది వెంకట్రాములు, రాళ్ల బండి శశిధర్, ఎం. ఆంజనేయులు, గోపాల్ సమ్మయ్య, సాంబశివ, లంక రాఘవులు, రమేష్ పాల్గొన్నారు.