దేశ ప్రథమ పౌరుడు/పౌరురాలి దక్షిణాది అధికారిక నివాసం.. నగరంలో బ్రిటిష్ పాలనకు కేంద్రంగా కొనసాగిన రెసిడెన్సీ భవనం.. వీవీఐపీలకు మినహా సామాన్యులకు అదొక బ్రహ్మ పదార్థం. కనీసం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ప్రతి ఏటా కేవలం వారం రోజులు మాత్రమే సామాన్యులకు సందర్శనావకాశం ఉండేది.. కానీ ప్రస్తుత రాష్ట్రపతి ఆదేశాలతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లో సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతోటలు, వందల ఏండ్లనాటి మర్రి చెట్లు, ఎండ ఆనవాళ్లు కూడా కానరాని పండ్ల తోటలు, మయూరాల కిలకిలారావాలు.. అలనాటి వ్యవసాయానికి కేంద్ర బిందువులైన మోట, మెట్ల బావులు.. గత రాష్ట్రపతులు వాడిన గుర్రపు బగ్గీ, వింటేజ్ బెంజీ కారు.. ఇలా చెప్పకుంటూ పోతే రాష్ట్రపతి నిలయం విశేషాలు ఎన్నెన్నో.. రాష్ట్రపతి విడిది చేసే ప్రత్యేక గదులు, మీటింగ్ హాల్స్, ప్రత్యేకంగా వంటచేసే కిచెన్, కిచెన్ నుంచి రాష్ట్రపతి ప్రధాన విడిది భవనానికి ఆహారాన్ని తీసుకెళ్లే సొరంగ మార్గం.. వాటితో పాటు ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం వేళలో సాంస్కతిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానంతో పాటు విహార అనుభూతి కల్గుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంపై ప్రత్యేక కథనం..
హైదరాబాద్ మహానగరాన్ని పాలించిన నిజాం నవాబుల కాలంలో ఎన్నో భవంతులు, విశ్రాంతి మందిరాల నిర్మాణం జరగ్గా, ప్రస్తుతం చాలామంది ధనవంతుల భవనాలు ప్రభుత్వ కార్యాలయాలుగా, విశ్వ విద్యాలయాలుగా, వైద్యాలయాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక వసతి గహం నేటికీ చెక్కు చెదరకుండా ప్రస్తుతం రాష్ట్రపతికి ఆతిథ్యమిస్తోంది. హైదరాబాద్‌లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం. శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి ఇక్కడ బస చేయడం ఆనవాయితీ. సికింద్రాబాద్ నుంచి 10 కి.మీ దూరంలో సిద్ధిపేటకు వెళ్ళేదారిలో లోతుకుంట అనే ప్రాంతానికి దగ్గర్లో రాష్ట్రపతి నిలయం ఉంది. దీన్ని పురాతన, వారసత్వ కట్టడంగా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది. సికింద్రాబాద్ దగ్గరలోని బొల్లారంలో అప్పటి నిజాం నవాబు ”నజీర్ ఉద్ దౌలా” 1860లో తన విశ్రాంతి మందిరంగా ఈ భవనాన్ని నిర్మించారని తెలుస్తుంది. దాదాపు 93 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఉన్న ఈ ప్యాలెస్ చుట్టూ 50 అడుగుల ఎత్తులో ఉండే గోడలు నిర్మించి కనుచూపు మేరలో ఉండగానే శత్రువుని కనిపెట్టేందుకు వీలుగా నిర్మాణం జరిగింది. నిత్యం నిజాం సైనికులు కనుసన్నల్లో ఉండేది. తదుపరి పరిపాలన సర్ సాలార్జంగ్ చేతికి వచ్చాక ఇది ప్రధాన సైనిక అధికారి కార్యాలయంగా మార్చారు. ఇక్కడే సైనికులకు శిబిరాలను ఏర్పాటు చేసి యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చేవారు. ఆ తరువాత బ్రిటిష్ పాలకులతో కుదిరిన ఒప్పందం మేరకు బ్రిటిష్ సైన్యానికి స్థావరాలుగా మార్చేశారు. బ్రిటిష్ సైనికాధికారులు సైతం తమ నివాస గహంగా మార్చేసుకున్నారు. అప్పట్లో దీనిని ”బ్రిటిష్ రెసిడెన్సీ” అని పిలిచేవారు. స్వాతంత్య్రం వచ్చాక చిన్న చిన్న రాజ్యాలు, సంస్థానాలన్ని సువిశాల భారతదేశంలో ఐక్యం కాగా, హైదరాబాద్ సంస్థానం విలీనం చేయడానికి మాత్రం నిజాం ఒప్పుకోలేదు. పైగా ప్రజలపై వేధింపులు పెరిగిపోయాయి. నిజాం పాలన తట్టుకోలేని ప్రజలు ‘ఆంధ్ర మహాసభ’ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటాంలో పాల్గొన్నారు. చివరకు భారత ప్రభుత్వం నిజాం సైనికులపై పోలీస్ చర్యకు పాల్పడింది. ఇది 5 రోజుల పాటు జరిగాక నిజాం తన సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేశాడు. భారత ప్రభుత్వం సైనిక స్థావరాలను కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్యాలెస్‌ని మిలిటరీ అధీనంలోకి తీసుకుంది. ఆపై భారత రాష్ట్రపతి విడిది నివాసంగా ఏర్పాటు చేశారు.
భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు మరో రెండు అధికారిక నివాసాల్లో ఒకటి షిమ్లా లోని ‘ది రిట్రీట్ బిల్డింగ్’ కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ‘రాష్ట్రపతి నిలయం’ మూడోది. ఈ భవనం నిజాం నజీర్ ఉద్-దౌలా హయాంలో 1860లో నిర్మితమైంది. బొల్లారంలోని 97 ఎకరాల సువిశాల స్థలంలో 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రధాన భవనం ఉంటుంది. కంటోన్మెంట్ పరిధిలోని చీఫ్ మిలటరీ ఆఫీసర్ నివాస స్థలంగా వినియోగించే ఈ భవనాన్ని రెసిడెన్సీ హౌజ్‌గా వ్యవహరించేవారు. 1948లో హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం రాష్ట్రపతి దక్షిణాది తాత్కాలిక నివాసంగా మారింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉంటుంది. ఈ భవనంలో మొఘల్ గార్డెన్స్‌కి ధీటుగా ఆరోగ్యాన్ని పెంచే మూలికా వనాల నడుమ నిత్య పచ్చదనంతో శోభాయమానంగా ఉంటుంది. అన్ని కాలాల్లో ఆహ్లాదకరంగా ఉండే అద్భుత వాతావరణం ఉన్న ఈ భవనానికి కొత్త సొగసులద్ది రాష్ట్రపతి నిలయంగా మార్చారు.దాదాపు 150 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ భవనంలో 20 నివాస గదులున్నాయి. వీటన్నింటిని 3 విభాగాలుగా విభజించారు. ప్రెసిడెంట్ వింగ్, ఫ్యామిలీ వింగ్, ఎడిసి వింగ్‌గా పిలుస్తున్నారు. ప్రత్యేకంగా పెద్ద డైనింగ్ హాల్, మార్నింగ్ రూం, డైనింగ్ హాల్ ప్రత్యేకంగా ఉంటాయి. ప్రధాన భవనానికి కొంత దూరంలో ఉండే కిచెన్ ద్వారా ఆహారాన్ని డైనింగ్ హాలుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక సొరంగ మార్గం ఉంది. రాష్ట్రపతి ప్రధాన నివాస భవనంతో పాటు మరో 150 మంది వరకు సిబ్బంది ఉండేందుకు ప్రత్యేక వసతి సముదాయం ఉంది. రకరకాల పూలమొక్కలతో పాటు పండ్ల తోటలున్నాయి. 116 రకాల సుగంధ, ఔషధ మొక్కలతో కూడిన ప్రత్యేక హెర్బల్ గార్డెన్ ఈ ఆవరణలో ఉంది. మూడు మంచి నీటి బావులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గదులన్ని అత్యాధునిక పరికరాలతో నిండి పోయాయి. ఈ భవనం నిర్మాణం 20-25 అడుగుల ఎత్తులో ఉండటం, అన్ని భవనాల్ని కలుపుతూ చుట్టూ ఉన్న విశాలమైన వరండా వల్ల ఈ నిర్మాణం చూడముచ్చటగా ఉంటుంది.
శీతాకాల విడిది..
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా మన దేశ ప్రథమ పౌరుడిగా మొదటి రాష్ట్రపతి డా|| బాబు రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకష్ణ, వి.వి.గిరి, డా|| నీలం సంజీవరెడ్డి తదితరులు క్రమం తప్పకుండా ప్రతి ఏటా 15 రోజులు బస చేసేవారు. 2000లో కె.ఆర్.నారాయణన్ వచ్చారు. ఆ తరువాత జ్ఞాని జైల్ సింగ్ వచ్చినప్పుడు కవి సమ్మేళనం, సాంస్కతిక కార్యక్రమాలకు విధిగా హజరయ్యేవారు. ఈ ప్రాంతం చాలా సుందరంగా ఉందని కితాబు ఇచ్చారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువగా శాస్త్రవేత్తల తోనూ, విద్యార్థులతోనూ సమావేశం అయ్యే వారు. ప్రతిభా పాటిల్ వచ్చినప్పుడు బొల్లారంలో మూలికా వనాన్ని ప్రారంభించారు. 2011 నుంచి రాష్ట్రపతి పర్యటన అనంతరం ఒక వారం రోజుల పాటు జంట నగరాల్లో సాధారణ పౌరులకు ఈ నిలయాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం రెండు లేదా మూడు వారాల పాటు మాత్రమే సాధారణ పౌరులకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి ఉండేది. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హయాంలో నిత్యం ప్రజల సందర్శనకు అవకాశం కల్పించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, వారాంతాల్లో రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. విద్యార్థుల సందర్శనకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు
అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417