నవతెలంగాణ-హైదరాబాద్: బసనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకున్న వారే తుడిచిపెట్టుకు పోతారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన ఏక వాక్యంలో ముక్తసరిగా ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు. మీడియా ప్రశ్నిస్తుండగానే ఆయన కారెక్కి వెళ్లిపోయారు. కాగా తిరుపతిలో కల్తీ లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం, ఆయనపై పలువురు విమర్శలు చేయడం మొదలైంది. తాజాగా ఆయన మరోసారి సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకున్న వాళ్లు తుడిచిపెట్టుకుపోతారని అన్నారు. ఈ క్రమంలో ఇవాళ చెన్నైలో మీడియా ప్రతినిధులు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. దాంతో ఆయన పైవిధంగా స్పందించారు.